చాకిరీ చేయలేక పారిపోతున్న దంపతుల్ని బంధించి..భార్యపై ఐదుగురు యజమానులు గ్యాంగ్ రేప్

చాకిరీ చేయలేక పారిపోతున్న దంపతుల్ని బంధించి..భార్యపై ఐదుగురు యజమానులు గ్యాంగ్ రేప్

five brick kiln owners gang rape : ఇటుకల బట్టీల్లో ఎంతోమంది కూలీల బతుకులు తెల్లారిపోతున్నాయి. కూలీల కష్టాల్ని దోచుకుంటున్న కొంతమంది యజమానుల దుర్మార్గాలకు అంతులేకుండాపోతోంది. రోజుకు దాదాపు 10 నుంచి 12 గంటలపాటు చాకిరీ చేసినా సరైన కూలి డబ్బులు ఇవ్వకుండా శ్రామికుల్ని హింసలు పెడుతున్న ఘటనల గురించి తెలిసిందే. ఈక్రమంలో చాకిరీ చేయించుకుంటూ కూలి డబ్బులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్న ఇటుకల బట్టీ యజమాని నుంచి పారిపోతున్న ఇద్దరు భార్యాభర్తల్ని పట్టుకుని భర్తను బంధించి భార్యపై ఐదుగురు ఇటుకల బట్టీల యజమానులు అత్యాచారం చేసిన దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పొట్ట చేత పట్టుకుని ఒరిశా నుంచి వచ్చిన భార్యాభర్తల బతుకులు ఆ ఇటుకల కొలిమిల్లో నాశనమైపోయిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌరెడ్డి పేట గ్రామంలో నిర్వహిస్తున్న ఓ ఇటుక బట్టిలో పనిచేసేందుకు ఒడిశా నుంచి భార్యాభర్తలు వచ్చారు. ఇచ్చేది అరకొర కూలీయే అయినా వేరే దారిలేక అక్కడే పనిచేసుకుంటూ ఉండేవారు. రోజుకు 10నుంచి 12 గంటల పని. రెక్కలు ముక్కలు చేసుకున్నా..చేతికి సరిగా అందని కూలి డబ్బులు. కడుపు నిండా తిండి ఉండదు. కంటినిండా నిద్రా ఉండదు. ఉండటానికి సరైన సౌకర్యాలు ఉండవు. అయినా సరే అన్నింటినీ భరిస్తూ ఎంతోమంది జీవితాలను ఆ ఇటుకల బట్టీల్లోనే కాల్చేసుకుంటున్నారు.

అటువంటి ఓ జంట రోజూ గంటల తరబడి బట్టీల్లో పని చేయలేక తమ ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి పారిపోయేందుకు యత్నించింది. సొంత ఊరు వెళ్లిపోయి కలో గంజో తాగి బతుకుదామని అనుకున్నారు. దీంతో ఆ ఇటుకల బట్టీల నుంచి తప్పించుకుని సొంత ఊరు వెళ్లిపోవటానికి రామగుండం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.

వాళ్లు పారిపోయారని తెలుసుకున్న సదరు ఇటుకల బట్టీ యజమానితో పాటు మరో నలుగురు బట్టీ యజమానులు వారిని పట్టుకున్నారు. తిరిగి మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకొచ్చి దారుణంగా కొట్టారు.అనంతరం 22ఏళ్ల భార్యపై ఐదుగురు ఇటుకల బట్టీల యజమానులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. భర్తను బంధించి దారుణంగా కొట్టి అతని కళ్లెదురుగానే ఈ దారుణాన్ని చేశారు. బాధతో భార్య కేకలు వేస్తుంటూ ఆ కామాంధులు మాత్రం పైశాచికానందాన్ని పొందారు. కట్టుకున్న భార్యను తన కళ్లెదురుగానే అత్యంత దారుణానికి బలైపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భర్త తల్లడిల్లిపోయాడు. ఆ దారుణాన్ని చూసి సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను బంధించి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారా ఇటుకల బట్టీల యజమానులు.

ఈ దారుణం గురించి తెలిసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాయగా జనవరి 24న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా మంగళవారం (జనవరి 9,2021)వెలుగులోకి వచ్చింది. ఆ లేఖ అందుకున్న హెచ్చార్సీ వెంటనే స్పందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, ఎస్సై రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్నను సోమవారం ఆదేశించింది.