ఇకపై విమాన ప్రయాణం ఇలానే ఉండబోతోంది..?

  • Published By: srihari ,Published On : May 18, 2020 / 02:51 AM IST
ఇకపై విమాన ప్రయాణం ఇలానే ఉండబోతోంది..?

విమాన ప్రయాణాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయా? మునపటిలా విమానాల్లో ప్రయాణించలేమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా నేర్పిన పాఠాలతో అన్నింట్లో కొత్త మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా విమానాశ్రయాలు, విమానాల్లోనూ వినూత్న విధానాలు అమల్లోకి రానున్నట్టు అంతర్జాతీయ విమానయాన సంస్థలు, నిపుణుల అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయో చెప్పలేం. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విమానాలు, విమానాశ్రయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సురక్షిత ఆరోగ్యకర ప్రయాణానికి అనుగుణంగా అనేక మార్పులు, చేర్పులు తథ్యమని నిపుణులు అంటున్నారు. భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రయాణికులకు భరోసా కల్పించేలా చేపట్టాల్సిన చర్యలపై విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు దృష్టి పెడుతున్నాయి. 

విమాన ప్రయాణాల్లో రక్త పరీక్షలు లేదా ముక్కులోంచి శాంపిల్స్ సేకరించడం తప్పనిసరి చేసే అవకాశం ఉంది. దుబాయ్ రక్త పరీక్షలను ఏప్రిల్ నెలలోనే తప్పనిసరి చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితం తేల్చేస్తారు. హాంకాంగ్ కూడా కొవిడ్ పరీక్షలను తప్పనిసరి చేసింది. అమెరికా, ఇటలీ వంటి ఎక్కువ ముప్పున్న దేశాల నుంచి వచ్చే వారికి టోక్యోలో కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు శానిటైజర్ కూడిన కిట్ తప్పనిసరి చేసింది. 

ప్రయాణం మొత్తంగా ముఖాన్ని కప్పిఉంచడం (ఫేస్ కవరింగ్) తప్పనిసరి కానుంది. కెనడాలో మాస్క్‌లు లేకపోతే అనుమతించడం లేదు. సిబ్బందికీ కూడా తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రయాణికులను పూర్తిగా శానిటైజ్ చేసేందుకు క్రిమినాశక బూత్‌లు రావొచ్చు. బహిరంగ ప్రాంతాలను అతినీల లోహిత కిరణాలతో శుభ్రంచేసే రోబోలు కూడా సేవలందిస్తాయి. సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా లోపలికి వెళ్లే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రయాణికులకు వారి సమయం వచ్చినప్పుడు ఫోన్ మెసేజ్ పంపుతారు. అప్పడే వారు వెళ్లాల్సి ఉంటుంది.

విమానాశ్రయాల్లో గుర్తింపు కార్డుతో పాటు రోగనిరోధక ధ్రువపత్రం లేదా హెల్త్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే థాయిలాండ్‌లో అమలుచేస్తోంది. కొత్తగా ఐఏటీఏ ఇమ్యూనిటీ పాస్‌పోర్టును ప్రతిపాదిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో యెల్లో ఫీవర్ కార్డులను ప్రయాణికులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. తీసుకెళ్లే లగేజీలను విమానాల్లోకి ఎక్కించే ముందు యంత్రాలతో వాటంతట అవే శానిటైజ్ కావడం లేదా అతినీల లోహిత కాంతితో క్రిమినాశకంగా తయారయ్యే విధానం కూడా రానుంది. అప్పుడే లగేజీ ట్యాగింగ్ చేస్తారు. దీన్నే శానిట్యాగింగ్ అని పిలుస్తున్నారు. విమానం దిగిన తర్వాత అదే లగేజీ బెల్ట్‌కు చేరుతుంది.

శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా చూస్తారు. ఇందుకు థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు అమరుస్తారు. పోర్టోరికోలో థర్మల్ కెమెరాలు పెట్టారు. శరీర ఉష్ణోగ్రత 100.3 డిగ్రీలు (ఫారన్హీట్) దాటగానే అలారం మోగుతుంది. విమానాల్లో సీట్ల వెనుక ఉండే ప్యాకెట్లను తొలగించి ఖాళీగా ఉంచొచ్చు. ఎంటర్ టైన్మెంట్‌కు సంబంధించి ఇక టచ్ స్ర్కీన్లు ఉండకపోవచ్చు. సొంత వినోద టూల్స్ అనుమతించవచ్చు.

విమానాల లోపల భౌతిక దూరం పాటించేలా కొత్త డిజైన్లు వస్తాయి. సీటుకు సీటుకు దూరం పెట్టనున్నారు. మధ్యలో ఒక సీటును తొలగించడం లేదా వదిలేయడం చేయొచ్చు. ఇటలీలోని ఓ ప్రముఖ విమాన డిజైన్ సంస్థ ఓ సరికొత్త డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. మూడు సీట్లుండే వరుసలో మధ్య సీటును వెనక్కు తిప్పేసి (వ్యతిరేక దిశలో) ఏర్పాటు చేయడమే ఈ విధానం. మూడు సీట్లకు మధ్య పారదర్శక డివైడర్లను కూడా అమరుస్తారు. విమానాలను రీ డిజైన్ చేయకుండా సీటుకు సీటుకు మధ్య చుట్టూ ఎత్తైన ప్రొటెక్టివ్ షీల్డ్‌లు అమర్చడాన్ని ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. 

చాలా విమానయాన సంస్థలు ఆహార సేవలను పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేసే అవకాశం ఉంది. వేడి వంటకాలకు బదులు ముందుగానే ప్యాక్ చేసి, శీతలీకరించిన భోజనాలను అందించొచ్చు. లోపల కప్పులతో నీళ్లు అందించడానికి బదులు, ప్రయాణికులు సొంతంగా నీళ్ల సీసాలను ముందే తీసుకురావాల్సి ఉంటుంది. విమానం ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ భోజనాలను టచ్ లెస్ వెండింగ్ మెషీన్ల ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది.

Read Here>> కరోనా ఎఫెక్ట్, మే 31 వరకు మెట్రో బంద్