FRO Killed : ఫారెస్ట్ ఆఫీసర్ హత్యపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

ఎఫ్ఆర్‌వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

FRO Killed : ఫారెస్ట్ ఆఫీసర్ హత్యపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

FRO Killed : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను గుత్తికోయలు హత్య చేయడం కలకలం రేపుతోంది. పోడుభూమి సాగుదారులు (గుత్తి కోయలు).. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు.

ఎఫ్ఆర్‌వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. డ్యూటీలో ఏ విధంగా జీతభత్యాలు అందుతాయో, అదే విధంగా శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయసు వరకు వారి కుటుంబసభ్యులకు ఈ వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అలాగే శ్రీనివాసరావు పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు కేసీఆర్. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అసలేం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు. జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రగూడు అటవీప్రాంతంలో ప్లాంటేషన్‌ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మొక్కలను నరకొద్దని గుత్తికోయలను హెచ్చరించారు. దీంతో గుత్తికోయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సహనం కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడున్న ఆయనను వెంటనే తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు.. అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో గతంలో ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. తాజాగా, ఆ భూముల్లో అధికారులు నాటిన మొక్కలను ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేసి చంపేశారు.

ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదు. ఫారెస్ట్‌ అధికారులు, గుత్తికోయల మధ్య దాడుల్లో గాయాలైనప్పటికీ.. తొలిసారిగా పోడుభూమి సాగుదారులు వేటకొడవళ్లతో దాడి చేయడం, ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్‌ అధికారి మృతి చెందడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.