ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: కాకినాడకు మాత్రమే చోటు..

ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: కాకినాడకు మాత్రమే చోటు..

Ease of Living Index 2020లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌ను రూపొందించారు. పక్కరాష్ట్రాల్లోని నగరాలు ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంటుంటే.. మన నగరాలు మాత్రం రోజు రోజుకూ ప్రమాణాలు తగ్గి కిందకు దిగిపోయాయి. కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో మన పెద్దనగరాలేవీ.. టాప్‌ టెన్‌లో ప్లేస్‌ దక్కించుకోలేకపోయాయి.

పది లక్షలకు పైగా జనాభా ఉండే నగరాలు, 10లక్షల లోపు జనాభా ఉండే నగరాలుగా వర్గీకరించి… ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 ర్యాంకులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 111 నగరాలు ఈ ర్యాంక్‌లకు పోటీపడ్డాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉండే నగరాల జాబితాలో.. నివాసయోగ్యానికి అత్యున్నత నగరంగా బెంగళూరు నిలిచింది. రెండో స్థానంలో పూణె, మూడవ స్థానంలో అహ్మదాబాద్, నాల్గవ స్థానంలో చెన్నై, ఐదవ స్థానంలో సూరత్ నగరాలు ఉన్నాయి. న‌వీ ముంబై, కోయంబ‌త్తూర్‌, వ‌డోద‌ర‌, ఇండోర్‌, గ్రేట‌ర్ ముంబై ఆ తర్వాత ర్యాంక్‌లు కైవసం చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 13వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సిటీగా విశాఖపట్నం నిలిచింది. కానీ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. ఈజ్‌ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో నిలిచింది వైజాగ్‌. హైదరాబాద్ 24, విజయవాడ 41వ ర్యాంక్ దక్కించుకున్నాయి.

టాప్ 10 నగరాలు(10లక్షల పైన జనాభా):
1. బెంగళూరు
2. పుణె
3. అహ్మదాబాద్
4. చెన్నై
5. సూరత్
6. నవీ ముంబై
7. కోయంబత్తూరు
8. వడోదర
9. ఇండోర్
10. గ్రేటర్ ముంబై

పది లక్షల లోపు జనాభా ఉండే చిన్న నగరాలకు ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్‌లో సిమ్లా తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భువనేశ్వర్, మూడో స్థానంలో సిల్వసా నిలిచాయి. నాలుగో స్థానంలో కాకినాడ నిలవడం విశేషం. ఐదవ స్థానాన్ని సేలం దక్కించుకుంది. వెల్లూరు, గాంధీన‌గ‌ర్‌, గురుగ్రామ్‌, దేవ‌న్‌గిరి, తిరుచిరాప‌ల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నివాసయోగ్య చిన్న నగరాల్లో వరంగల్ 19, కరీంనగర్ 22వ ప్లేస్ కైవసం చేసుకున్నాయి. తిరుపతి 46వ స్థానంలో నిలిచింది. న‌గ‌రాల్లో జీవ‌నం సాగించేందుకు ఉన్న అనుకూల ప‌రిస్థితుల‌ను అధ్యయనం చేసి ఈ ర్యాంకుల‌ను కేటాయించారు.

టాప్ 10 నగరాలు(10లక్షల లోపు జనాభా):
1. సిమ్లా
2. భువనేశ్వర్
3. సిల్వసా
4. కాకినాడ
5. సేలం
6. వేలూరు
7. గాంధీనగర్
8. గురుగ్రామ్
9. దావణగెరె
10. తిరుచిరాపల్లి

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌తో పాటు మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. అందులో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటిగిరీలో.. విశాఖపట్టణం 9వ స్థానంలో నిలిచింది. ఇక పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో.. తిరుపతి రెండో స్థానంలో నిలిచింది. మిలియన్ ప్లస్ కేటగిరిలో నిర్వహించిన మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్‌లో ఇండోర్ మొదటి స్థానం కైవసం చేసుకుంది. సూరత్, భోపాల్, పింప్రి-చించ్వాడ్ నగరాలు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో హైదరాబాద్‌ 17, విజయవాడ 27వ స్థానాల్లో నిలిచాయి.

పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఢిల్లీ , తిరుపతి , గాంధీనగర్‌, కర్నాల్‌, సేలం వరుసగా మొదటి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ జాబితాలో కాకినాడకు 11వ ర్యాంక్ దక్కగా.. వరంగల్‌కు 18వ ర్యాంకు, కరీంనగర్‌కు 21వ ర్యాంకు దక్కింది. ప‌ట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చ‌ర్యలు, మెరుగైన జీవ‌న ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించిన‌ట్లు కేంద్రం వెల్లడించింది.