పార్టీ మారట్లేదు.. గంటా క్లారిటీ!

పార్టీ మారట్లేదు.. గంటా క్లారిటీ!

Ganta Srinivasa Rao:విశాఖ మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నట్లుగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణం అవ్వగా.. లేటెస్ట్‌గా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గంటా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. 2019 నుంచి ఇప్పటివరకు సుమారు వందసార్లు తాను పార్టీలు మారుతున్నట్లుగా పుకార్లు వచ్చాయని, విజయసాయి రెడ్డి ఏ లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు అర్థం కావట్లేదని అన్నారు. విశాఖలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ మైండ్ గేమ్‌లా ఇది ఉందని అభిప్రాయపడ్డారు.

నేను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలని, తన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరడంపై మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లుగా కాశీ ఎన్నో ఇబ్బందులు పడ్దారని, తాను పార్టీ మారుతున్న విషయంలో అడ్డు చెప్పలేదని, కాశీ తనకు ముఖ్య అనుచరుడని, చోడవరంతో సహా పలు నియోజకవర్గాల్లో ఎంతోమంది అనుచరులు పార్టీ మారారని చెప్పుకొచ్చారు. నేను మార్టీ మారల్సీవస్తే అందరిని సంప్రదించే పార్టీ మారుతాను తప్ప ఒక్కరోజులో మారే పరిస్థితి లేదని అన్నారు.

పార్టీ మార్పుపై తేల్చేసిన గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ తాను పార్టీ మారాల్సి వస్తే అందరితో ధైర్యంగా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. గంటా శ్రీనివాసరావు అధికార వైసీపీ లేదా బీజేపీలోకి చేరుతున్నారంటూ చాలారోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.