ఒక్క సెల్ఫీ.. జైల్లో చెమట్లు పట్టించింది.. 600 తాళాలు, పాస్ వర్డులు మార్చేసింది

ఒక్క సెల్ఫీ.. జైల్లో చెమట్లు పట్టించింది.. 600 తాళాలు, పాస్ వర్డులు మార్చేసింది

German Prison Changes over 600 Locks: యూత్ కి సెల్ఫీలపై ఉన్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్ఫీల కోసం ఏమైనా చేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టేవారూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిసోవడం.. నేటి యూత్ కి హాబీగా మారింది.

సెల్ఫీలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, వెళ్లిన చోటు ఎలాంటిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఎందుకంటే, ఒక్క ఫొటోతో ఎన్నో విషయాలు బయటపడతాయని సైబర్‌ నిపుణులు చెబుతుంటారు. అలాంటి ఘటనే జర్మనీలో జరిగింది. ఓ యువకుడు జైల్లో తీసుకున్న ఒక్క సెల్ఫీ.. అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. ఏకంగా జైల్లో ఉన్న 600 గదులకు తాళాలు, పాస్ వర్డులు మార్చాల్సి వచ్చింది.

బెర్లిన్‌లోని జేవీఏ హైడరింగ్‌ జైలుకి ఇటీవల ఒక యువకుడు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వెళ్లాడు. మొదటిసారి జైలుకొచ్చిన అతడు ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ తో పంచుకోవాలనుకున్నాడు. ఆ ఆతృతతో జైలులోని ప్రధాన కార్యాలయంలో సెల్ఫీ తీసుకుని దాన్ని వాట్సాప్‌ లో షేర్‌ చేశాడు. అయితే, అతడు దిగిన సెల్ఫీలో జైలుకు సంబంధించి మాస్టర్‌ తాళం చెవితోపాటు ముఖ్యమైన గదులకు సంబంధించిన తాళం చెవులు కూడా కనిపించాయి. ఫొటోలో ఆ తాళం చెవులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. నిపుణులతో వాటికి నకిలీ తాళంచెవులు సృష్టించగలిగేలా ఉన్నాయట.

ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు కంగుతిన్నారు. వెంటనే అతడిని ఇంటర్న్‌షిప్‌ నుంచి తొలగించి.. నష్టనివారణ చర్యలకు దిగారు. జైల్లో ఉన్న 600 గదులకు తాళాలు, పాస్‌కోడ్‌లు మార్చారు. అయితే ఈ తాళాలు మార్చడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. పాతవి తీసేసి కొత్తవి మార్చడానికి 20 మంది సిబ్బంది అవసరమయ్యారట. ఒకవేళ పోలీసులు సమయానికి చర్యలు తీసుకోకపోయి ఉంటే ఘోర అనర్థం జరిగిపోయి ఉండేదని స్థానికులు, అధికారులు అంటున్నారు. ఆ తాళంచెవులు పొరపాటున ఖైదీలకు అంది ఉంటే కచ్చితంగా వారంతా పారిపోయే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ జైల్లో 657 మంది ఖైదీలు ఉన్నారు. సరైన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పిందని జైలు అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.