ఆ పని చేసినందుకు.. పిస్తా హౌస్‌కు రూ.50వేల జరిమానా

10TV Telugu News

ghmc fine pista house restaurant: రూల్స్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. గీత దాటిన వ్యాపార సంస్థలపై కొరడా ఝళిపిస్తున్నారు. స్వయంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడమే కాదు సోషల్‌ మీడియాలో వచ్చే ఫిర్యాదులకు కూడా స్పందించి యాక్షన్ తీసుకుంటున్నారు.

ఇటీవల కొత్తగా ఎన్నికైన గ్రేటర్ మేయర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలో పలు చోట్ల టీఆర్ఎస్ నేత, మేయర్ అనుచరుడు అతిష్ అగర్వాల్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఓ నెటిజన్ ట్విట్టర్ లో జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించగా, వారు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఫ్లెక్సీలను అనధికారికంగా ఏర్పాటు చేసినట్టు గుర్తించిన అధికారులు వెంటనే వాటిని తొలగించారు. అంతేకాదు టీఆర్ఎస్ నేతకు లక్ష రూపాయలు ఫైన్ కూడా వేశారు. ఇలాంటి ఉదంతమే మరొకటి వెలుగుచూసింది.

తాజాగా హైదరాబాద్‌లో హలీమ్‌, బిర్యానీకి ప్రసిద్ధి చెందిన పిస్తా హౌస్‌(Pista House) రెస్టారెంట్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దిమ్మతిరిగే షాకిచ్చింది. చార్మినార్‌లోని పిస్తాహౌస్‌ నిర్వాహకులు రెస్టారెంట్ ముందు బోర్డును ఏర్పాటు చేశారు. కళ్లు జిగేల్ మనేలా విద్యుద్దీపాలతో ఆ బోర్డును ఏర్పాటుచేశారు. ఈ లైట్లు ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వారి కళ్లను బైర్లు కమ్మేలా చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ ట్విటర్‌ ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం(ఫిబ్రవరి 16,2021) పిస్తా హౌస్‌ను పరిశీలించిన అధికారులు రూ.50వేల జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా లైట్లు ఏర్పాటు చేసి ప్రజలను అసౌకర్యానికి గురి చేసినందుకు జరిమానా వేశామని అధికారులు తెలిపారు.

దీంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పరిశీలించిన అధికారులు కొన్నింటికి పెద్దమొత్తంలో ఫైన్లు వేశారు. భవన సముదాయంపై అనుమతి లేకుండా ప్రకటన బోర్డు ఏర్పాటు చేసినందుకు నాగోల్‌లోని శ్రీనివాస ఫర్నిచర్స్‌కు రూ.లక్ష, అల్కాపురి ఎక్స్‌రోడ్డులోని లక్కీ రెస్టారెంట్‌కు రూ.1.5లక్షల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. ట్విటర్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

×