Madras high court: క్రాస్ ధరించి చర్చికి వెళ్లడం వల్ల SC సర్టిఫికేట్ రద్దు కాదు

ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయలేమని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

Madras high court: క్రాస్ ధరించి చర్చికి వెళ్లడం వల్ల SC సర్టిఫికేట్ రద్దు కాదు

Madhras

Madras high court: ఏసుక్రీస్తును కొలవడం, మెడలో శిలువ ధరించడం, గోడలకు ప్రభువు ఫోటో తగిలించుకోవడం, చర్చికి వెళ్లడం వంటివి కారణాలుగా చూపుతూ ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయలేమని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. హిందు పల్లన్‌ సామాజికవర్గానికి(ఎస్సీ) చెందిన ఓ వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయగా.. సదరు మహిళ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. ఈ పిటీషన్‌పై విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

రామనాథపురానికి చెందిన ఒక మహిళా వైద్యురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ మరియు జస్టిస్ ఎం. దురైస్వామి డివిజన్ బెంచ్, ఆమె ఒక క్రిస్టియన్‌ను వివాహం చేసుకుని, ఆమె క్లినిక్ గుర్తుపై శిలువ వేసినంతమాత్రాన ఆమె క్రైస్తవ మతంలోకి మారినట్లు కాదని కోర్టు అభిప్రాయపడింది. శిలువ లేదా ఇతర మతపరమైన చిహ్నాలు, ఆచారాలను పాటించినందుకు ఓ దళితుని SC కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను రద్దు చేయలేమని స్పష్టంచేసింది కోర్టు.

హిందూ పల్లన్‌ సామాజిక వర్గానికి చెందిన మహిళా క్రిస్టియన్‌ను పెళ్ళి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉండగా.. వారు కూడా క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పి ఆమెకు ఇచ్చిన పల్లన్‌ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. అధికారుల నిర్ణయంపై ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ సంధర్భంగా ప్రధాన న్యాయమూర్తి.. “పిటిషనర్ తన భర్త, పిల్లలతో కలిసి ఆదివారం ప్రార్థన కోసం వెళ్లి ఉండవచ్చు, కానీ కేవలం ఒక వ్యక్తి చర్చికి వెళ్లినంతమాత్రాన.. తన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేసినట్లు కాదని, అధికారుల వైఖరి సంకుచితంగా ఉందని, దీనిని రాజ్యాంగం ప్రోత్సహించదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకొని, పిటిషనర్ కమ్యూనిటీ సర్టిఫికేట్‌ను అధికారులు రద్దు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. సర్టిఫికెట్‌ను మళ్లీ పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది.