మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త, తగ్గనున్న ధరలు

మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త, తగ్గనున్న ధరలు

good-news-for-liquor-lovers1

good news for liquor lovers: కేంద్ర ప్రభుత్వం త్వరలో పలు విదేశీ బ్రాండ్ల మద్యంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించే యోచన చేస్తోంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న మద్యంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని సగానికి తగ్గించనుంది. ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ ఉండగా, 75శాతం పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ లో విదేశీ బ్రాండ్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే లభించే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, కేంద్ర ఆహార ఉత్పత్తుల తయారీ, ఆల్కహాలిక్ బేవరేజ్ మ్యాన్యూఫాక్చరర్స్ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా.. యూరోపియన్ యూనియన్‌తో యూరప్-ఇండియా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా యూరప్ ఆల్కహాల్ బ్రాండ్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే యోచనలో కేంద్రం ఉంది.

ఇదే జరిగితే దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తి సంస్థలకు కొత్త చిక్కులు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌తో పోల్చుకుంటే యూరప్‌లో ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి అయ్యే ఖర్చు 50 శాతం తక్కువగానే ఉందని.. ఈ పరిస్థితుల్లో కస్టమ్స్ సుంకం పరిమితికి మించి తగ్గిస్తే దేశీయ ఆల్కహాల్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కాన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీస్(సీఐఏబీసీ) డైరెక్టర్ జనరల్ వినోద్ గిరీ చెప్పారు. కేంద్రం మాత్రం మరో వెర్షన్ వినిపిస్తోంది. విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ ఆల్కహాల్ ఉత్పత్తి సంస్థల వ్యాపార విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చింది.