Google: గూగుల్ దాతృత్వం.. పల్లెల్లో ఆక్సిజన్ ప్లాంట్లు!

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చి సౌకర్యాల నుండి ఆక్సిజన్ వరకు అందిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా భాగం కానుంది.

Google: గూగుల్ దాతృత్వం.. పల్లెల్లో ఆక్సిజన్ ప్లాంట్లు!

Google

Google: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చి సౌకర్యాల నుండి ఆక్సిజన్ వరకు అందిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా భాగం కానుంది. గూగుల్ తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.113 కోట్ల నిధులు కేటాయించింది. గూగుల్‌ దాతృత్వ విభాగం గూగుల్ డాట్ ఆర్గ్‌ ద్వారా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి మొత్తం 80 ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. కేటాయించిన ఈ రూ.113 కోట్ల నిధులలో గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కూడా చేపట్టనున్నారు.

అధికంగా అవసరం ఉన్న గ్రామీణ ప్రాంతాలను గుర్తించి గివ్ ఇండియా, పాత్‌ అనే స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇందుకోసం గివ్ ఇండియాకు రూ.90 కోట్లు, పాత్‌కు రూ.18.5 కోట్లు ఇవ్వనున్నట్లు గూగుల్ డాట్ ఆర్గ్‌ వివరించింది. 20 వేల మంది ఫ్రంట్‌లైన్‌ ఆరోగ్య కార్యకర్తలకు అపోలో మెడ్‌ స్కిల్స్‌ ద్వారా కొవిడ్‌ నిర్వహణలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు కూడా ఆర్థికసాయం చేయనున్నట్లు గూగుల్ డాట్‌ ఆర్గ్ పేర్కొంది.

మొత్తం 15 రాష్ట్రాల్లో లక్షా 80వేల మంది గుర్తింపు పొందిన ఆశా కార్యకర్తలు, 40 వేల మంది ఏఎన్ఎంలు ఉండగా వీరికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆర్మన్‌ సంస్థకు రూ.3.6 కోట్లు ఇవ్వనున్నట్లు గూగుల్ వివరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన గూగుల్‌ ఇండియా భారత ఉపాధ్యక్షుడు సంజయ్ గుప్తా.. భారతీయ ఆరోగ్య రంగ మౌలిక వసతులను, ఆరోగ్య కార్యకర్తలను బలోపేతం చేయడమే తమ సంస్థ లక్ష్యమని వెల్లడించారు.