ఆన్ లైన్ రుణాలపై గూగుల్ కొరడా, 10 భారతీయ లోన్ యాప్ లపై చర్యలు

ఆన్ లైన్ రుణాలపై గూగుల్ కొరడా, 10 భారతీయ లోన్ యాప్ లపై చర్యలు

personal loan apps : ఆన్లైన్ రుణాల పేరిట ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న యాప్‌లపై గూగుల్ కొరడా ఝుళిపించింది. ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. సదరు యాప్‌లు ఇండియా చట్టాలకు లోబడి లేవని.. అంతేగాక భారత నిబంధనను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ప్రాణాలను బలిగొంటున్నాయని ఆరోపిస్తూ గూగుల్ ఈ చర్యలకు దిగింది. దాదాపు 10 భారతీయ లోన్ యాప్‌లపై గూగుల్ చర్యలు తీసుకుంది. వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా డిలీట్ చేసింది. ఈ మేరకు గూగుల్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా తాము భారత్‌లో ఉన్న పలు రుణ యాప్‌లపై సమీక్ష జరిపామని గూగుల్ తెలిపింది. అవి భద్రతా విధానాలను ఉల్లంఘించినట్లు తాము గుర్తించడంతో వెంటనే వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించామని.. మిగిలిన యాప్‌లు కూడా స్థానిక చట్టాలకు లోబడి పనిచేస్తున్నాయో లేదో తెలపాలని వాటి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని వెల్లడించింది. ప్లే స్టోర్ నుంచి టెన్ మినట్స్ లోన్, ఎక్స్ మనీ, ఎక్స్‌ట్రా ముద్రా, స్టక్కర్డ్ వంటి యాప్‌లతో పాటు మరో ఆరు యాప్‌లను తొలగించింది.

ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఇన్ స్టంట్ లోన్లతో గాలం విసురుతున్నాయి. లిమిటెడ్ డాక్యుమెంటేషన్, క్షణాల్లో బ్యాంకు అకౌంట్లోకి మనీ క్రెడిట్ చేయడం.. ఈజీగా లోన్ రావడంతో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఆన్ లైన్ లోన్ యాప్‌లపై ఆధారపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి Instant Loan అని సెర్చ్ చేసేస్తున్నారు. దాదాపు 200 లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. క్షణాల వ్యవధిలో మీ బ్యాంకు అకౌంట్లో మనీ క్రెడిట్ చేసేందుకు రెడీ అంటున్నాయి.

ఈజీ లోన్ కోసం రుణదారులు ఎక్కువగా ఈ యాప్ లనే నమ్ముకుంటున్నారు. లోన్ తీసుకోవడం తప్పు కాదు.. అంతా సవ్యంగా జరిగితే ఓకే.. కానీ, తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోతేనే అసలు సమస్య.. ఎందుకంటే.. ఈ చిన్నపాటి ఫైనాన్స్ సంస్థలు ఈజీగా ఇన్ స్టంట్ లోన్లు ఇచ్చేది.. తక్కువ వడ్డీతో కాదు.. భారీ వడ్డీలు వసూలు చేస్తాయి.
క్షణాల్లో అప్పు ఇచ్చి ఆపదలో ఆదుకుంటామంటూ నోటిఫికేషన్లు ఇస్తూ ప్రాణాలు తీస్తున్నాయి క్రెడిట్ యాప్స్‌. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ దందాను కొనసాగిస్తున్నాయి.

మూడు వేల నుంచి 20 వేల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్‌. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పుడు మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఈ యాప్స్‌.