Medaram Jatara: “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్పూర్తికి ఆదర్శం మేడారం జాతర: గవర్నర్ తమిళిసై

వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని" అన్నారు

Medaram Jatara: “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్పూర్తికి ఆదర్శం మేడారం జాతర: గవర్నర్ తమిళిసై

Governor

Medaram Jatara: దేశంలో “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” నినాదానికి మేడారం జాతర స్ఫూర్తిగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. శనివారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెల వద్ద గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని” అన్నారు. “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్పూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ జాతరకు మద్దతుగా నిలుస్తున్న గిరిజన మంత్రిత్వశాఖను అభినందిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై చెప్పారు.

Also read: CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్

మేడారం జాతరలో పాల్గొనేందుకు వరంగల్ మీదుగా రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు చేరుకున్న గవర్నర్ తమిళిసైకు స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. గిరిజనుల జీవనాన్ని చూసేందుకే హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చినట్లు గవర్నర్​ తమిళిసై తెలిపారు. అయితే, గవర్నర్ రోడ్డు మార్గాన రావడంతో..ఆ మార్గంలోని ఇతర వాహనాలను పోలీసులు నిలిపివేశారు. గవర్నర్ దర్శనం సందర్భంగా ఇతర భక్తుల క్యూ లైన్లను అధికారులు నిలిపివేశారు. దీంతో అధికారుల తీరుపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను కలిసేందుకే రోడ్డు మార్గాన వచ్చానని, భక్తులకు ఇబ్బంది కలిగించడం సబబు కాదని ఆమె అన్నారు.

Also read: Afghan Sikhs – Modi: అఫ్గాన్​ సిక్కు- హిందూ ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ