తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 12:49 AM IST
తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌

ఆర్టీసీ సర్వీసులు తిప్పేందుకు అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం చేసుకోవాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై ఏపీ, కర్నాటక, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. కర్ణాటకలోని బెంగళూరు, యాద్గిర్‌, రాయచూర్‌, బీదర్‌ వంటి రూట్లపై ఆ రాష్ట్రంతో చర్చిస్తారు. ఈ ఒప్పందాలు పూర్తయినప్పటి నుంచే అంటే.. మూడు, నాలుగు రోజుల్లోనే ఏపీకి సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులు తప్పకుండా కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించాలన్న నిబంధన పెట్టనున్నారు. సాధారణంగా గరుడ, గరుడ ప్లస్‌, రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులే ఇతర రాష్ర్టాలకు వెళ్తుంటాయి. ఇరువైపులా రెండేసి సీట్లుండే వీటిలో పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఇప్పట్లో రోడ్డెక్కేలా కనిపించడం లేదు. రాజధానిలో ప్రగతి చక్రాలు పరుగు పెట్టేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. హైదరాబాద్‌లో సిటీ బస్సులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిటీ బస్సులు నడపాలా… వద్దా అన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇప్పుడే బస్సులు నడపవద్దని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. జిల్లాల నుంచి వస్తున్న బస్సులు కూడా MGBS, JBS కు వెళ్తున్నాయి. కానీ నగర పరిధిలో తిరిగే బస్సులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం జీఎచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్న నేపథ్యంలో.. సిటీ బస్సులను తిప్పితే మరింత ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్ భావించారు. సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని.. తద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని అంచనాకు వచ్చారు. అందుకే ఇప్పుడే బస్సులు నడపవద్దని అధికారులకు సూచించారు సీఎం.

Read: హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్లే…