25 ఎకరాల కోసమే కిడ్నాప్.. చేతులు మారిన కోట్ల రూపాయలు!

25 ఎకరాల కోసమే కిడ్నాప్.. చేతులు మారిన కోట్ల రూపాయలు!

Hafeezpet Land Issue : రాజధానిలో కలకలం రేపిన ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. హఫీజ్‌పేటలోని 25 ఎకరాల భూ లావాదేవీలకు సంబంధించిన వివాదామే కిడ్నాప్ వరకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధానంగా భూమా అఖిలప్రియతో పాటు భార్గవ రామ్, ఏవీ సుబ్బారెడ్డిలను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కేవలం హఫీజ్‌పేట్ భూ వివాదం మాత్రమే కిడ్నాప్ వ్యవహారానికి ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 25 ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో విభేదాల కారణంగానే ప్రవీణ్‌రావ్‌ సోదరుల కిడ్నాప్‌ కు కారణమని పోలీసులు తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ వ్యవహారంపై మూడు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోందని… ఆర్థిక వ్యవహారంలే కిడ్నాప్ వరకు తీసుకెళ్లాయని పోలీసులు వెల్లడించారు.

హఫీజ్ పేట సర్వే : –
హఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లో 25 ఎకరాల భూమిని ఐదేళ్ల క్రితం ప్రవీణ్‌రావు కొన్నారు. ఆ భూమితో పాటు అదే సర్వే నంబర్‌లోని మరో 23 ఎకరాల భూమి తమదని అప్పట్లో భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు ప్రవీణ్‌కు చెప్పారు. వివాదం సెటిల్‌ చేస్తానంటూ ప్రవీణ్‌రావు వద్ద సుబ్బారెడ్డి డబ్బు తీసుకున్నారు. నాగిరెడ్డి చనిపోయిన కొన్నాళ్లకు ప్రవీణ్‌రావుకు అఖిలప్రియ, సోదరి మౌనిక ఫోన్‌చేసి.. ఆ భూమి తమదంటూ వాదించారు. సుబ్బారెడ్డి ద్వారా వివాదం పరిష్కారమైంది కదా అంటే దాంతో తమకు సంబంధం లేదన్నారు. భూముల ధరలు కోట్లకు చేరడంతో మరింత సొమ్ము ఇవ్వాలని సుబ్బారెడ్డి, అఖిలప్రియలు ప్రవీణ్‌ సోదరులను డిమాండ్‌ చేశారు. ప్రవీణ్‌ స్పందించకపోవడంతో అఖిలప్రియ వారిని అపహరించి బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించారు.

భూమా అఖిల ప్రియకు ఏ రకంగా హక్కులున్నాయి ? : –
హఫీజ్ పేట్‌ భూమిపై భూమా అఖిలప్రియకు ఏ రకంగా హక్కులున్నాయో తెలపాలని ప్రవీణ్ రావు సోదరుడు ప్రతాప్ రావు ప్రశ్నించారు. తమకు ఎప్పుడూ భూమా నాగిరెడ్డితో కానీ, ఆయన కుటుంబంతో కానీ ఎలాంటి సంబంధం లేదని… ఏ వ్యవహారమైనా కేవలం ఏవీ సుబ్బారెడ్డి ద్వారానే తాము చర్చించినట్లు వెల్లడించారు. నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి భాగస్వామ్యులు కాబట్టి… వాళ్లిద్దరి మధ్య వివాదాలు వారే పరిష్కరించుకోవాలని ప్రతాప్ రావు సూచించారు. చట్టపరంగా వారికి ఏ విధమైన హక్కులున్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

సంతకాలు చేయించలేదన్న భూమా మౌనిక : –
హఫీజ్‌పేట భూమి ఓ కంపెనీ పేరు మీద ఉందని… అందులో అందరూ సభ్యులుగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సోదరి భూమా మౌనిక తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి అందరికీ అన్ని విషయాలు తెలుసన్నారు. సంస్థలో భాగస్వామ్యుల మధ్యలో విబేధాలున్నాయన్నారు. ఏవీ సుబ్బారెడ్డితో కూడా ఇతర భాగస్వామ్యులకు గొడవలున్నాయన్నారు. ఎవరూ బలవంతంగా ఎవరితో సంతకాలు చేయించలేదని మౌనిక తెలిపారు.

ఆర్థిక లావాదేవీలే కీలకం : –
హఫీజ్ పేట్ భూ వివాదంలో తన పేరు అనవసరంగా వచ్చిందని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కిడ్నాప్ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కిడ్నాప్ కేసు విచారణలో తన పేరును తప్పని సరిగా తొలగిస్తారని ఏవీ ధీమా వ్యక్తం చేశారు. ఈ గొడవకు ఎలాంటి కారణాలున్నాయో తనకు తెలియదన్నారు. ప్రవీణ్‌రావ్‌ సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో ప్రధానంగా హఫీజ్‌పేట్‌ భూ వివాదంతో పాటు ఆర్థిక లావాదేవీల అంశమే అని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కోట్ల విలువైన భూమికి సంబంధించి మూడు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం… ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కిడ్నాప్ కేసులో ఓ మాజీ మంత్రి అరెస్ట్ కావడంతో అటు రాజకీయంగా కూడా ఈ వ్యవహరం దుమారం రేపుతోంది.