జాగ్రత్త.. తెలంగాణలో నేడు వడగాలులు, వానలు

తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 02:03 AM IST
జాగ్రత్త.. తెలంగాణలో నేడు వడగాలులు, వానలు

తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు

తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతూ నిప్పులు కురిపిస్తున్నాడు. అదే సమయంలో అక్కడక్కడ వానలు కూడా కురుస్తున్నాయి. శనివారం(మే 30,2020) రాష్ట్రంలోని పలుచోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీయొచ్చని హెచ్చరించింది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరాఠ్వాడ, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు దగ్గర ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సూర్యుడి భగభగలు:
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మండిపోతుండటంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 8 నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మాడు పగిలేలా ఎండలు ఉన్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు.

తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం:
తెలంగాణ, ఆంధప్రదేశ్ లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మరో 4 రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం(మే 29,2020) ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక శనివారం, ఆదివారం(మే 31,2020) కూడా 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

నిప్పుల కుంపటిలా ఇండియా:
భారత దేశంలోని అనేక ప్రాంతాలు ఎండల ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణ్రోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 49.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గంగానగర్‌, బీకనేర్‌, కోటలో వరుసగా 48.9 డిగ్రీలు, 48 డిగ్రీలు, 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు ఎక్కువ నమోదైంది. పాలం ప్రాంతంలో అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శీతల ప్రాంతమైన జమ్మూలో సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జూన్ 1 నాటికి దేశంలోకి నైరుతి రుతుపవనాలు:
జూన్ 1 నాటికే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31 న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

Read: చల్లటి కబురు : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి