ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్‌, ఆ ఆదేశాలు కొట్టివేత

ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్‌, ఆ ఆదేశాలు కొట్టివేత

highcourt gives shocks to sec nimmagadda ramesh kumar: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రీనామినేషన్లు అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో ఏకగ్రీవాలు అయిన వాటినే పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు వార్డు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలను కూడా కొట్టివేసింది. వాలంటీర్ల నుంచి ట్యాబ్ లు, ఫోన్లు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది.

గత(2020) మార్చిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల రీ నామినేషన్లకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్మిషన్ ఇచ్చారు. దీంతో నిన్న(మార్చి 2,2021) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్లలోని 14వార్డులకు రీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించారు. అయితే.. ఎస్‌ఈసీ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎస్‌ఈసీ ఆదేశాలను నిలిపేసింది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు వాలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు.. వాలంటీర్లపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను సైతం నిలుపుదల చేసింది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయని, స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠినచర్యలు అవసరమని ఎస్ఈసీ అన్నారు. రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని… పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దన్నారు. వారి కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. లబ్ధిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలన్నారు.

ఎస్‌ఈసీ జారీ చేసిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వాలంటీర్లపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది.