దేశంలో మండుతున్న ఎండలు : తగ్గుముఖం పట్టని కరోనా

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 01:34 AM IST
దేశంలో మండుతున్న ఎండలు : తగ్గుముఖం పట్టని కరోనా

దేశవ్యాప్తంగా  ఎండలు మండిపోతున్నాయి. భగ భగమంటున్న భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఓవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా….కరోనా వైరస్‌ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.మండు టెండలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి ఉత్తర భారతం అగ్నిగోళంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీలో రానున్న రోజుల్లో ఎండలు మరింత మండిపోయే ప్రమాదం ఉండడంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాజస్తాన్‌లో వేసవి ఆలస్యంగా మొదలైంది. గత వారంలో రోజుల్లోనే ఎండలు భగ భగ మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో రికార్డు స్థాయిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గుజరాత్‌ రాజధాని అహమదాబాద్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా మే 27 వరకు  భానుడి ప్రతాపం ఉంటుందని, వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో రానున్న రెండురోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చెరి, కరైకల్ ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అంపన్ తుపాను తర్వాత ఉత్తర, మధ్య భారతాల్లో వేడి పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు

ఎండవేడికి కరోనా సోకదన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. దేశరాజధానిలో శుక్రవారం ఒక్కరోజే 600 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఇచ్చినా మధ్యాహ్న సమయంలో ప్రజలు ఎండల వల్ల రోడ్లపైకి రావడం లేదు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. నగరంలోని కొన్ని పార్కులకు లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చింది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పార్కులు తెరిచి ఉంచాలని నిర్ణయించింది.