చారిత్రక ఘట్టం : 29న కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభం..చండీయాగం, సుదర్శనయాగం

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 03:50 AM IST
చారిత్రక ఘట్టం : 29న కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభం..చండీయాగం, సుదర్శనయాగం

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం సాక్షాత్కరించబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టును సిద్ధమైంది. లక్ష్మీబరాజ్‌ నుంచి వివిధ దశల్లో 229 కిలోమీటర్లు పయనించిన గోదావరి జలాలు.. అరకిలోమీటర్‌ ఎత్తున ఎగిసి పడి.. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సిగలో దూకబోతున్నాయి.

ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌజ్‌ దగ్గర సుదర్శనయాగం నిర్వహించనున్నారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ పంపుహౌజ్‌ను స్విచాన్‌ చేసి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్‌ దగ్గరికి వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. 

కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు : –
ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

చిన జీయర్ స్వామి : –
అనంతరం మర్కూక్ వద్ద కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ శ్రీశ్రీశ్రీ  త్రిదండి రామానుజ చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌజ్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జ్‌ కెనాల్ వద్దకు చేరుకుని గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. గోదావరికి గంగమ్మకు పూజలు చేస్తారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామికి కేసీఆర్‌ దంపతులు వీడ్కోలు పలుకుతారు. ఆహ్వానించిన కొద్ది మంది అతిథులకు అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

వేలాది ఎకరాలకు సాగు నీరు : –
రాష్ట్రంలోని సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సాగునీరు అందించే కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను పంప్ చేసే అపూర్వ ఘట్టం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్నది. గోదావరి నదిపై మేడిగడ్డ నుంచి వివిధ లిఫ్టుల ద్వారా తరలించే నీరు 618 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లోకి చేరుతుంది. 15 టీఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా  వ్యవసాయానికి సాగునీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వేలాది ఎకరాలు సాగులోకి వస్తుంది. 

కొండపోచమ్మ పేరు పెట్టడానికి కారణం : –
అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో కొండ పోచమ్మ దేవాలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయం ఉంది.  కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన అతి పెద్ద రిజర్వాయర్ కు మల్లన్న సాగర్‌గా…  అత్యధిక ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ కు కొండ పోచమ్మ సాగర్‌గా  కేసీఆర్‌ పేర్లు ఖరారు చేశారు. కొండ పోచమ్మకు ఈ ప్రాంతంలో లక్షలాది మంది  భక్తులున్నారు.  నిత్యం వేలాది మంది పూజలు చేస్తారు. తమను చల్లగా చూసే దేవతగా కొలుస్తారు.   ఈ ప్రాజెక్టును ఓ దేవాలయం మాదిరిగా భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read: హైదరాబాద్‌లో వరదలు వస్తాయా ?