ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..

ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..

holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సెలవులకు సంబంధించి ఏపీ ప్రభుత్వ జీవో పేరిట ఉన్న ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ అవుతోంది.

గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని సీల్ కూడా ఉండటంతో జనాలు దీన్ని నమ్మేశారు. ఒకరి నుంచి ఒకరికి ఫార్వార్డ్ చేసేశారు. అలా అలా ఈ వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదు. ఇది ఫేక్ న్యూస్. అసలు.. స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులే ప్రకటించలేదు.

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై ఏకంగా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. ఏపీలో మార్చి 1 నుంచి విద్యా సంస్థలకు సెలవులు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇది ఫేక్ న్యూస్ అని, ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఈ తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్టు మంత్రి తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే విద్యా సంస్థలు నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారాయన.

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఫేక్ న్యూస్ లు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. తప్పుడు సమాచారం బాగా ప్రచారం అవుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. అందులో ఏవి నిజం? ఏది అబద్దం.. తెలియక జనాలు తికమకపడుతున్నారు.

కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. గుడ్డిగా ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తనూ నమ్మకూడదు. ఇతర మీడియా విభాగాల్లో ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే ధృవీకరించుకోవాలి. లేదంటే చిక్కులు తప్పవు. అసలే సోషల్ మీడియాపై కేంద్రం కఠినమైన నిబంధనలు తెచ్చింది. తేడా వస్తే తాట తీస్తామంటోంది. గీత దాటితే జైలుకి పంపిస్తామంటోంది. సో, బీ కేర్ ఫుల్…