లాక్ డౌన్ బేఖాతర్ : ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న జనాలు

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 03:13 AM IST
లాక్ డౌన్ బేఖాతర్ : ఆవు అంత్యక్రియల్లో పాల్గొన్న జనాలు

కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు విధించిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చారు. కానీ వీటిని కొంతమంది జనాలు పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. సెంటిమెంట్ల సాకుతో..లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తాజాగా…ఒక ఆవు అంత్యక్రియలు నిర్వహించడానికి జనాలు పోటెత్తారు. దాదాపు 150 మంది పాల్గొన్నారని అంచనా. లాక్ డౌన్ 4.0 కొనసాగుతుందనే విషయం తెలిసినా..అంత్యక్రియల్లో కేవలం 20 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొన వద్దనే నిబంధన ఉందని తెలిసినా..అవేమీ పట్టించుకోలేదు. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీగఢ్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వారంతా..రోడ్లపై నడుచుకుంటూ..వెళుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఊరు ఊరంతా కలిసి వెళ్లి ఆవు అంత్యక్రియలు నిర్వహించడం ఇప్పుడు టాపిక్ అయ్యింది. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 
గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ ప్రేమగా పెంచుకున్న ఎద్దు మరణించింది. దీంతో ఆ ఎద్దు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. అంత్యక్రియల్లో దాదాపు వేయి మంది పాల్గొన్నారని అధికారులు అంచనా వేశారు.