అత్తగారింట్లో ఉన్నప్పుడు మహిళపై ఎవరు దాడి చేసినా భర్తదే బాధ్యత..సంబంధం లేదంటే కుదరదు : సుప్రీంకోర్టు

అత్తగారింట్లో ఉన్నప్పుడు మహిళపై ఎవరు దాడి చేసినా భర్తదే బాధ్యత..సంబంధం లేదంటే కుదరదు : సుప్రీంకోర్టు

Husband liable for woman’s injuries in matrimonial home : మహిళ అత్తాగారి ఇంట్లో ఉన్నప్పుడు ఆమెపై ఎవరు దాడి చేసినా దానికి భాద్యత భర్తదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ కు చెందిన ఓ కేసు విషయంలో ‘‘తన భార్యకు తగిలిన గాయాలకు తాను బాధ్యుడిని కాదనీ..ఆమెపై జరిగిన దాడికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఓ భర్త అన్న మాటలకు సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. సదరు భర్తపై సీజేఐ బాగా తలంటారు. తన భార్యను తన తండ్రి కొట్టాడని నాకు సంబంధం లేదని అన్న భర్త పై సీజేఐ అసహనం వ్యక్తంచేస్తూ తీవ్రంగా మందలించింది.

2020 జూన్ లో పంజాబ్ లుథియానాకు చెందిన ఓ మహిళ తనను భర్తతో పాటు అత్తింటివారు హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు పోలీసులు సదరు కుటుంబాన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ భర్త తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. కానీ హైకోర్టు ఆ పిటీషన్ ను తిరస్కరించింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

సదరు భర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతూ సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్యకు తగిలిన గాయాలకు తాను కారకుడ్ని కాదని..తన తండ్రి వల్ల ఆమెకు గాయాలయ్యాయని ఆ వ్యక్తి పిటిషన్ లో వివరించాడు. తన తండ్రి వల్ల అయిన గాయాలకు తనను ఎలా బాధ్యుడ్ని చేస్తారన్న ఆ వ్యక్తి, ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం… అత్తగారింట ఉన్నప్పుడు ఓ మహిళపై ఆ ఇంట్లోవాళ్లు ఎవరు దాడిచేసినా అందుకు భర్తదే బాధ్యత అని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వేం మనిషివంటూ మండిపడింది. “భార్యపై నీ తండ్రి దాడి చేస్తే నీకు సంబంధం లేదా? వివాహం చేసుకుని కన్నవారిని వదిలి నీతోనే జీవితం పంచుకోవటానికి వచ్చిన భార్య కష్టసుఖాలు పట్టించుకోవా? నీ తండ్రి నీ భార్యను కొడితే పట్టించుకోకుండా..తన గోడు నీతో చెప్పుకున్న భార్యను తిరిగి క్రికెట్ బ్యాట్ తో కొడతావా? నువ్వసలు మనిషివేనా? అంటూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. నువ్వు కొట్టడం వల్లే అబార్షన్ అయిందనీ..తనను చంపడానికి నువ్వు నీ కుటుంబం యత్నించావని ఆమె చెబుతోంది. వీటికి నీ సమాధం ఏంటీ? అంటూ ప్రశ్నించింది. అత్తగారింట ఇతర కుటుంబ సభ్యులు చేసిన దాడిలో భార్య గాయపడితే ప్రధాన బాధ్యత వహించాల్సింది భర్తే” అని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు..