సూపర్ కాప్స్.. బస్సులో పారిపోతున్న దొంగలను విమానంలో వెళ్లి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

10TV Telugu News

hyderabad police went in plane to catch robbers: క్రిమినల్స్ ను పట్టుకునే విషయంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ సత్తా చాటారు. ముందుచూపుతో చాలా స్మార్ట్ గా వ్యవహరించి సూపర్ కాప్స్ అనిపించుకున్నారు. దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. చోరీ చేసి సొంతూరికి బస్సులో వెళ్లిన దొంగలను పట్టుకోవడానికి ఏకంగా విమానంలో వెళ్లారు పోలీసులు. వారి కంటే ముందుగానే వెళ్లి.. దొంగలకు బేడీలు వేశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వాక్స్ బేకరీలో కొన్నిరోజుల క్రితం దొంగతనం జరిగింది. దాదాపు రూ.5 లక్షల నగదు చోరీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బేకరీ యజమాని అమర్ చౌదరి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు తక్షణమే విచారణ ప్రారంభించారు. చోరీ జరిగిన విధానం గురించి ఓ అంచనాకు వచ్చిన పోలీసులు అది ఇంటి దొంగల పనే అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. వెంటనే నాలుగు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు దొంగలను గుర్తించారు. బేకరీలో పని చేస్తున్న వాచ్‌మన్ సోహిదుల్ అస్లాం మరికొంత మందితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుసుకున్నారు. వాచ్‌మన్ ఫోన్ నంబర్, అతడి చిరునామా ఆధారంగా విచారణ కొనసాగించారు. సోహిదుల్ ప్రధాన నిందితుడని, అతనికి ఎల్బీ నగర్ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అలీముద్దీన్ తో పాటు అక్సెదుల్ అలీ సహకరించారని గుర్తించారు. వీరు పక్కా ప్లాన్ తో నగదును చోరీ చేశారని తెలుసుకున్న పోలీసులు వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయగా, వీరంతా బస్సులో కోల్ కతా వెళుతున్నట్టు తేలింది.

ఆ వెంటనే పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. వారికన్నా ముందే కోల్ కతాకు విమానంలో బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ పోలీసులకు విషయం చెప్పి, వారు ప్రయాణిస్తున్న మార్గం వివరాలను తెలిపారు. కోల్ కతాలో దిగిన జూబ్లీహిల్స్ స్పెషల్ టీమ్ బృందం, నిందితులు బస్సులో ఉండగానే గుర్తించి, అరెస్ట్ చేశారు. వారు దొంగిలించిన సొత్తుని రికవరీ చేశామని, ముగ్గురినీ రిమాండ్ కు తరలించామని వెల్లడించారు.

పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోల్‌కతా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. సాయంత్రం ఐదున్నర గంటలకు కోల్‌కతా చేరుకున్నారు. 150 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సరిగ్గా రాత్రి 8గంటల సమయంలో పోలీసులకు తాము వెతుకుతున్న బస్సు తారసపడింది. బస్సును అడ్డగించి ఆపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బస్సులో పోలీసులను చూసి దొంగలు షాక్‌ తిన్నారు. వారిని అదే మార్గంలో తిరిగి జూబ్లీహిల్స్‌కు తరలించారు పోలీసులు.

సినీ ఫక్కీలో జరిగిన ఈ ఆపరేషన్ లో పోలీసులు విజయం సాధించారు. గంటల వ్యవధిలో నిందితులను పట్టుకుని తెలంగాణ పోలీసులు మరోసారి సూపర్ కాప్స్ అనిపించుకున్నారు. క్రిమినల్స్ ను పట్టుకునే విషయంలో పోలీసుల పని తీరుకి ప్రశంసలు అందుతున్నాయి. తెలంగాణ పోలీసులకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.