ప్రేమంది..‘పెళ్లి చేసుకుందాం’రమ్మంది : ముహూర్తం కూడా పెట్టాక..ఫోన్ స్విచ్చాఫ్..విషయం తెలిసి మైండ్ బ్లాంక్..

ప్రేమంది..‘పెళ్లి చేసుకుందాం’రమ్మంది : ముహూర్తం కూడా పెట్టాక..ఫోన్ స్విచ్చాఫ్..విషయం తెలిసి మైండ్ బ్లాంక్..

online-fraud-in-the-name-of-marriage1

Hyderabad young man loss rs. 14 lakh : సోషల్ మీడియాలో పరిచయం. ప్రేమ, పెళ్లి పేరుతో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని జరిగినా ఇంకా మోసపోతునే ఉన్నారు. సోషల్ మీడియాలో అమ్మాయి పరిచయం అయితే చాలు సర్వం మరచిపోయి చాటింగ్ లు డేటింగు అంటే దగాపడిపోయే ఘటనలు ఎన్నో జరిగాయి. దానికి ఉదాహరణగా ఇదిగో మరో బకరా బలైపోయాడు ఓ కిలేడీకి. ప్రేమంది. పెళ్లి చేసుకుందా రా అంది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించి. ఆనక చక్కగా లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటనతో హైదరాబాద్ లోని అర్జున్ అనే అబ్బాయి మరో బకరా అయ్యాడు ఓ కిలాడీ ఖాతాలో..

హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో ఉండే అర్జున్ అనే యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటాడు. హెల్త్ టిప్స్ గురించి వీడియోలు తయారు చేసి టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటాడు. అలా ప్రొఫైల్ ను ఓ లుక్కేసిన ఓ కిలాడీ లేడీ..మీ పోస్టుల్ని ఫాలో అవుతున్నానంటూ రంగంలోకి దిగింది. 2020 ఏప్రిల్ లో అర్జున్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఘట్టమనేని వర్ణనా మల్లికార్జున్ పేరుతో తనను పరిచయం చేసుకుంది. అలా వారిద్దరి పరిచయం సోషల్ మీడియా నుంచి ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకూ వెళ్లింది. ట్సప్ లో ప్రతీరోజూ చాటింగులు చేసుకునేవారు. చక్కగా ముస్తాబైన ఫొటోల్ని అర్జున్ కు పంపించేది.

’నాకు అమ్మానాన్నలు లేరు. చిన్నప్పుడే చనిపోయారు. మా అక్కే నన్ను, నా తమ్ముడిని చదివించింది. నేను కేరళలో చదువుకున్నాననీ..ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నానని బాగా చదువుకుని స్థిరపడ్డాం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అర్జున్ కు ఆమెపై జాలి కలిగింది. తన వివరాలన్నీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ’మీరు మాట్లాడే తీరు. మీరుచేసే వీడియోలు చాలా బాగున్నాయంటూ మెచ్చుకుంది. మీ ప్రొఫైల్ నచ్చింది. మనం పెళ్లి చేసుకుందామా? అంటూ అడిగింది. ఇద్దరం కలిసి పేదలకు వైద్య సేవలు చేద్దాం‘ అనే సరికి పాపం అర్జున్ అదంతా నిజమేనని నమ్మేశాడు. వెంటనే ఓకే చెప్పేశాడు.

దీంతో తన పాచిక పారింది అనుకుంది. నెక్ట్స్ స్టెప్ స్టార్ట్ చేసిందా కిలాడీ లేడీ. అర్జున్ పెళ్లికి ఓకే అన్నప్పటి నుంచి మెల్లగా డబ్బును లాగే ప్రక్రియకు తెరలేపింది. తన తమ్ముడికి ల్యాప్ టాప్ అవసరం ఉందని కానీ నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బులేదని బేలగా అర్జున్ తో చెప్పేసరికి అందెత భాగ్యం అంటూ ల్యాప్ టాప్ కొనిచ్చేశాడు. సునీత్ అనే వ్యక్తిని ఆమె పంపిస్తే అతడికి ల్యాప్ టాప్ ఇచ్చి పంపించాడు అర్జున్.

ఆ తర్వాత మరోసారి..సెప్టెంబర్ లో తన సోదరుడికి కరోనా వచ్చింది. ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ కు పంపిస్తున్నాననీ మీరు నా సోదరుడ్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. ఏం ఫరవాలేదు. నీకు సోదరుడైతే మనం పెళ్లి చేసుకుంటే నాకు బావమరిది అవుతాడు కదా..నేను చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడకు అంటూ అర్జున్ అభయహస్తం ఇచ్చాడు. అలా కొండాపూర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించాడు. ఆ చికిత్సకు 4.60 లక్షల రూపాయల బిల్లు అర్జునే కట్టాడు. ఆ తర్వాత రూ.1.5 లక్షలతో ఓ బంగారపు హారం కొని పంపించాడు. నవంబర్ లో పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అర్జున్ ఎగిరి గంతేశాడు.

పెళ్లి ముహూర్తం కూడా పెట్టించి ఆమెకు ఫలానా డేట్ అని చెప్పాడు. ఓకే చెప్పేసిందామె. కానీ పెళ్లి అంటే చాలా ఖర్చులు ఉంటాయి కదా..పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలని అడిగింది. అలా 25 రోజుల్లో 8లక్షల డబ్బు, బంగారు ఉంగరం, పంపించాడు. తీరా పెళ్లి డేట్ కు సరిగ్గా రెండ్రోజుల ముందు వర్ణన ఫోన్ స్విచాఫ్ అయింది. దీంతో తనతో టచ్ లో ఉండే సేనీత్ అనే వ్యక్తికి ఫోన్ చేయగా అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో ఉంది.

దీంతో పదే పదే ఇద్దరి ఫోన్లకు చేస్తూనే ఉండేవాడు. కానీ ఎంతకూ స్విచ్ఛాఫ్ అనే చెప్పేది. పాపం అప్పటికి గానీ అర్జున్ కు అర్థం కాలేదు. తాను మోసపోయానని..దీంతో అతడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా మొత్తం రూ.14 లక్షలకు పైగా మోసపోయాడు అర్జున్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి అర్జున్ లు ఎంతో మంది సైబర్ క్రైమ్ కు బలైపోయారు. ప్రేమ, పెళ్లిపేరుతో జరిగుతున్న మోసాన్ని జనాలు గ్రహంచటంలేదు. మోసగాళ్ల వల్లో పడుతూనే ఉన్నారు.