Rahul Gandhi: ఉజ్వల తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం ..

ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు..

Rahul Gandhi: ఉజ్వల తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం ..

Rahual Gandhi

Rahul Gandhi: ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ట్విటర్ వేదికగా ‘మీ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరులు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ హయాంలో దారుణమైన పాలనను చవిచూసిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నా.. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడంపై దృష్టి సారించాం. ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను అంటూ రాహుల్ గాంధీ ట్విటర్ లో పేర్కొన్నారు.

భారతదేశంలో తక్కువ వయస్సు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిందని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజల వాణిని విని తెలంగాణ కలను సాకారం చేసేందుకు నిస్వార్థ్యంగా పనిచేసినందుకు  నేను గర్విస్తున్నానంటూ రాహుల్ గాంధీ ట్విటర్ లో పేర్కొన్నారు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడిన తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.