Oxygen Distribution: తెలంగాణకు యుద్ధ విమానాలతో ఆక్సిజన్ దిగుమతి

రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామని ఈ నిర్ణయం వల్ల కొరత రాలేదని ..

Oxygen Distribution: తెలంగాణకు యుద్ధ విమానాలతో ఆక్సిజన్ దిగుమతి

Iaf Deploys 5 Aircraft To Aid Oxygen Distribution

Oxygen Distribution: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతుండటం, పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరతతో రోగులు చనిపోతుండటం వంటివి జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో ఆక్సిజన్‌ కొరత లేకపోయినా.. ముందుజాగ్రత్త ఆలోచనతో చర్యలు చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వం ఒడిశాలోని ప్లాంట్ల నుంచి తెలంగాణకు కేటాయించిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ఎయిర్‌ఫోర్స్‌ సహాయంతో వేగంగా దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో తొమ్మిది ఆక్సిజన్‌ ట్యాంకర్లను హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు పంపారు. అవి అక్కడ ఆక్సిజన్‌ నింపుకొని ఏప్రిల్ 27వ తేదీలోగా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటాయి.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శుక్రవారం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి ట్యాంకర్లను ఒడిశాకు పంపే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామని ఈ నిర్ణయం వల్ల కొరత రాలేదని మంత్రి ఈటల చెప్పారు.

భవిష్యత్తులో కూడా ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు అధిక విలువ ఇస్తోందని, ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రానికి దాదాపు 400 టన్నుల ఆక్సిజన్‌ కావాల్సి ఉండగా.. కేంద్రం 250-270 టన్నుల మేర ఆక్సిజన్‌ కేటాయించిందని అధికారవర్గాలు తెలిపాయి.

ఖాళీ ట్యాంకర్లు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి రావడానికి వారం, పది రోజులకుపైగా పడుతుందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రాగానే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు అవసరమైన మేరకు సరఫరా చేయనున్నారు. ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ చైతన్య నిఝవాన్‌ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపు చేపడుతున్నారు.