Rice : రోగనిరోధకశక్తిని పెంచే వరివంగడం…జింక్ పుష్కలం..సప్లిమెంట్లతో పనిలేదు

ఈ రకం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే జింక్ కోసం ఇతర సప్లిమెంట్లపై అధారపడాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్స్ పెంచటంతోపాటు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ బియ్యం దోహదపడతాయి.

Rice : రోగనిరోధకశక్తిని పెంచే వరివంగడం…జింక్ పుష్కలం..సప్లిమెంట్లతో పనిలేదు

Rice

Rice : రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల్లో జింక్ ఒకటి. మారుతున్న ఆహార అలవాట్లతో చాలా మందిలో జింక్ లోపం అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో జింక్ ప్రాధాన్యత బాగా పెరిగింది. మనం తీసుకునే ఆహారంలో జింక్ అధికంగా కలిగిన బియ్యం రకాల్లో ఎన్ ఎల్ ఆర్ 3238 రకం ఒకటి. మిగిలిన వరి రకాలతో పోలిస్తే ఇందులో జింక్ అధికంగా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎంటీయూ 1010, బీపిటీ 5204 సంకరంతో ఎన్ ఎల్ ఆర్ 3238ను సృష్టించారు. ఈ వంగడం అభివృద్ధిలో అనేక మంది నిపుణులైన శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఉన్నట్లు ఆచార్య ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ టి. గోపీకృష్ణ తెలిపారు. స్వల్పకాలంలో అధిక దిగుబడులు ఇవ్వటం ఈ వంగడం స్పెషాలిటీ.

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందించిన ఎన్ ఎల్ ఆర్ 3238రకంలో జింక్ 22.5శాతం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇతర వరిరకాల్లో గరిష్టంగా 16శాతం మాత్రమే ఉండగా ఈ వెరైటీలో జింక్ అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

ఈ రకం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే జింక్ కోసం ఇతర సప్లిమెంట్లపై అధారపడాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్స్ పెంచటంతోపాటు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ బియ్యం దోహదపడతాయి. ఎన్ ఎల్ ఆర్ 3238 వరి రకం తెగుళ్ళను తట్టుకోవటంతోపాటు, అధిక దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 35 బస్తాల నుండి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది.

ఎన్ ఎల్ ఆర్ 3238 వరిరకం సాగు చేయాలనుకునే రైతులు నెల్లూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సంప్రదించవచ్చు. బీపీటీ 5204 తరహాలోనే దిగుబడిని ఇవ్వటంతోపాటు, అన్ని కాలాల్లో ఈ వంగడం సాగుకు అనుకూలంగా ఉంటుంది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడంపై పరీక్షలు నిర్వహించారు. అన్ని వాతావరణాల్లో ఈ వంగడం సాగుకు అనుకూలం కావటంతో మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ వరి రకం బియ్యంతో వండి అన్నం బాగా రుచిగా ఉన్నట్లు చెప్తున్నారు. అన్నం కూడా ఒదిగి వస్తుందని అంటున్నారు.