Jandhyala Pournami : జంధ్యాల పౌర్ణమి

శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించేవారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు.

Jandhyala Pournami : జంధ్యాల పౌర్ణమి

Jandhyala Pournami

Jandhyala Pournami : శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించేవారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము ‘యజ్ఞము’ ‘ఉపవీతము’ అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే ‘యాగము’ ‘ఉపవీతము’ అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు.

శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన  ‘అమరకోశాన్ని’ రచించిన అమరసింహుడు ‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః’ అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం, వేదాన్ని అధ్యయనం చేయడం ‘ఉపాకరణం’. సంస్కార పూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ. మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి.   సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను, జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు.

ఉపనయన సంస్కారం పొందినవారిని ‘ద్విజులు’ అని అంటారు.ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం ‘జ్ఞానాధ్యయనం’ గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడుతుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసి వేస్తారు.

జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది.పాల్కురికి సోమన ఈ పూర్ణిమని ‘నూలి పున్నమి’ అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం.

ఉపనయనం అయిన వారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ ‘జంధ్యాల పూర్ణిమ’  కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు  అష్టోత్తరాలతో  యాధాశక్తి గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు

ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||

అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.

యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజ:||

ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తా లుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింప చేస్తారు. ఒంటి ముడి వుండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.

యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని ‘బ్రహ్మముడి’ అంటారు. ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. మనం ధరించే జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.

జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా వుంటే ధనహాని కల్గుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు,  సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు.  పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవుతాయి.  బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు (యజ్ఞోప వీతం) ఇవ్వడం మంచిది. గాయత్రీ మాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే 12 సం. లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిస్తారు.

నేటి కాలంలో ఉపనయనం ప్రాముఖ్యత తగ్గిపోయింది… కానీ  “ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది.

బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత.

“అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు, విద్యార్ధి  మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు.  కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు.  కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు.