Hanuman Jayanti 2022 : శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత

శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది.

Hanuman Jayanti 2022 : శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత

Hanuman Vijayotsavam

Hanuman Jayanti 2022 :  శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.

హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారది కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేసాడు. హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. తన హృదయాన్ని చీల్చి సీతా రాములను చూపించాడు. ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోనతలు ఎన్నో కనబడతాయి.

చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది… హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.

నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి. చంద్రుడు పదహారు కళలతో సూర్యేందు సంగమ కాలాన్నే పర్వ సంధి కాలం అని అంటారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ, తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు.

ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి 12 పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై, ప్రతీ మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి వుండటం వల్ల, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది. ఇలా ఏడాదిలోని పండ్రెండు పౌర్ణమిలు పండ్రెండు పర్వ దినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వ మానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు. అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు.

”కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.

హనుమంతుని నైజం :-
యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.

కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు.   పరమశివుని అంశతో జన్మించారు. సప్త (7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాక ముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.

భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
Also Read : Hanuman Jayanti : హనుమత్ జయంతి ఎప్పుడు చేసుకోవాలి

ఈ ఏడాది   16 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 25 మే, వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతి రోజు 1, 3, 5,11 లేక 41….. (మీకు వీలైనన్ని సార్లు) హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి రోజు స్వామికి పండ్లు తప్పని సరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలుగుతుంది.