IND vs AUS A : దుమ్మురేపిన బుమ్రా

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 08:13 AM IST
IND vs AUS A : దుమ్మురేపిన బుమ్రా

IND vs AUS A Practice Match : బుమ్రా..టీమిండియా పేసర్. పదునైన బంతులను సంధిస్తూ..ప్రత్యర్థులను ఇరకాటంలోకి పెట్టే ఇతను..బ్యాట్‌ను ఝులిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా అర్థ సెంచరీ సాధించాడు ఇతను. పదోస్థానంలో బ్యాటింగ్‌‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు. అనంతరం బౌలింగ్‌లో కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఆసీస్ – ఏ పతనం కీలక పాత్ర పోషించాడు.

పింక్ బాల్ ప్రాక్టీస్ : –
డే అండ్ నైట్ టెస్టుకు సన్నాహకంగా..నిర్వహిస్తున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా..ఆసీస్ – ఏ జట్టుతో టీమిండియా తలపడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్..తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా బుమ్రా ఆల్ రౌండర్ అవతారమెత్తాడు. బుమ్రా (57 బంతుల్లో 55 నాటౌట్)గా నిలిచాడు. అటు బౌలింగ‌్‌లో కూడా..నిప్పులు చెరిగాడు.

అనూహ్య పరిణామాలు : –
బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే తొలిదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేదు. మరో ఓపెనర్ పృథ్వీ షా ఆచితూచి ఆడాడు. ఇతనికి శుబ్‌మన్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించే పనిలో పడ్డారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించిన తర్వాత..పృథ్వీ షా (40) అవుట్ అయ్యాడు. హనుమ విహారి (15), గిల్, కెప్టెన్ అజింక్య రహానే (4), పంత్ (5), సాహా (0), షమీ (0) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆసీస్ శిబిరంలో సంతోషాలు వ్యక్తమయ్యాయి. టీమిండియా స్కోరు 100 పరుగులు దాటిన తర్వాత..అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆదుకున్న బుమ్రా : –
14 పరుగుల వ్యవధిలోనే భారత్ 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా జట్టును ఆదుకున్నాడు. సిరాజ్ అతడికి తోడ్పాడు అందించాడు. ధాటిగా ఆడిన బుమ్రా 55 నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి వికెట్ కు 71 పరుగులు జోడించాక సిరాజ్ (22 పరుగులు) అవుట్ అయ్యాడు. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో …48.3 ఓవర్ల‌లో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఆసీస్‌కు కష్టాలు : –
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా తన తొలి ఓవర్ల‌లోనే ఓపెనర్ బర్న్స్ (0) వెనక్కి పంపాడు. బుమ్రా, షమీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడానికి మాడిసన్ (19), ఓపెనర్ హారిస్ (26) కష్టపడాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11 ఓవర్లలో వర్షం పడడంతో ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి ఆట ప్రారంభమైన అనంతరం షమీ..ఒకే ఓవర్లలో హారిస్‌తో పాటు..మెక్ డెర్మాట్ (0)ను వెనక్కి పంపాడు. మాడిసన్ ను సిరాజ్ (1/26), అబాట్ (0)ను షమీ అవుట్ చేయడంతో ఆసీస్ జట్టు స్కోరు 56/5వద్ద నిలిచింది. కెప్టెన్ కేరీ (32) కొంత పట్టుదలగా ఆడాలని ప్రయత్నించినా..సాధ్యం కాలేదు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఫలితంగా…32.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబి బంతితో విజృంభించిన బౌలర్లు జట్టుకు 86 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టారు.