భారత్, పాకిస్తాన్ మంచి మిత్రులుగా ఉండాలి.. అదే నా కల!

భారత్, పాకిస్తాన్ మంచి మిత్రులుగా ఉండాలి.. అదే నా కల!

Malala Yousafzai:బాలికలకు చదువు కోసం పోరాడి, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నోబెల్ పురస్కారం అందుకున్న మలాలా యూసఫ్ జాయ్.. భారత్, పాకిస్తాన్ కలిసి ఉండాలని, మంచి స్నేహితుల్లా ఉండాలని, అదే తన కల అంటూ చెప్పుకొచ్చారు. దాయాది దేశాలు రెండూ సఖ్యతగా కలిసి మెలిసి ఉండడం చూడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇరు దేశాల వారు పరస్పరం ఒక దేశం నుంచి మరో దేశంలోకి పర్యటించే అవకాశం ఉండాలని అన్నారు.

“పాకిస్తాన్ కళాకారులు ప్రదర్శించే నాటకాలను భారతీయులు చూసే అవకాశం ఉంటుంది. మేం కూడా బాలీవుడ్ సినిమాలను, క్రికెట్ మ్యాచ్‌లను హాయిగా ఆస్వాదించవచ్చు” అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, పాకిస్తాన్‌లో కానీ, భారత్‌లో కానీ మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని మలాలా నొక్కి చెప్పారు. తాను ప్రస్తావించిన అంశాన్ని మతపరమైన కోణంలా చూడరాదని, అధికార దోపిడీ కోణం నుంచి మాత్రమే పరిగణనలోకి తీసుకుని, వారి రక్షణకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చెయ్యాలని ఆమె కోరారు.

‘ఐ యామ్ మలాలా, ది స్టోరీ ఆఫ్ ది గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ పేరిట తాను రాసిన పుస్తకంపై జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా వర్చ్యువల్‌గా నిర్వహించిన డిబేట్‌లో ఆమె పాల్గొంది.

ఈ సంధర్భంగా.. భారత, పాకిస్తాన్ దేశాలు ఒకదానికొకటి గౌరవించుకోవాలని, రెండు దేశాల మధ్య ద్వేషం ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దాయాది దేశాలకు అసలైన శత్రువు పేదరికం, అసమానతలేనని, వీటిని అధిగమించి రెండు దేశాలు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుని ముందుకు సాగాలని ఆమె అభిప్రాయపడ్డారు.