అందరి చూపు మే 03 : ఇటలీ తరహాలో లాక్ డౌన్ ఎత్తివేత!

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 01:58 AM IST
అందరి చూపు మే 03 : ఇటలీ తరహాలో లాక్ డౌన్ ఎత్తివేత!

భారతదేశంలో లాక్ డౌన్ మళ్లీ కొనసాగిస్తారా ? మే 03వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఎలాంటి పద్ధతులను అవలింబిస్తుందనేది తెలియరావడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచదేశాలను గడగడలాడించింది

ఎన్నో దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఇటలీలో కూడా మరణాలు ఎక్కువగా ఉండడం, వైరస్ ను కట్టడి చేసే క్రమంలో లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. యూరప్ దేశాల్లో అన్ని దేశాల్లో కన్నా ఫస్ట్ లాక్ డౌన్ ప్రకటించింది ఈ దేశమే అని చెప్పవచ్చు. 

ఇటలీలో తొలి కరోనా కేసు 2020, ఫిబ్రవరి 20వ తేదీన వెలుగులోకి వచ్చింది. మార్చి 10వ తేదీన లాక్ డౌన్ విధించింది. కానీ ఆ రోజుల్లోనే కేసులు అధికం కావడం, మరణాలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రధాన మంత్రి గిసెప్పీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న మూడో దేశం, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత..రెండో దేశంగా ఇటలీ నిలిచింది. లాక్ డౌన్ విధించడంలో గిసెప్పీ ఆలస్యం చేశారనే కామెంట్స్ వినిపించాయి. 

భారత్ లో లాగానే 2020, మే 03వ తేదీతో ఇటలీలో లాక్ డౌన్ ముగియబోతోంది. ఫస్ట్ ఫేజ్ కింద లాక్ డౌన్ విధించడం ద్వారా వైరస్ ను కట్టడి చేయడం, రెండో దశలో వైరస్ తో పాటు కలిసి బతకడం అనేది తమ వ్యూహమంటూ..ఇటలీ ప్రధాని గిసెప్పీ మార్చి 09వ తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 04వ తేదీన పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరదని, అయితే..రోజువారి సడలింపులు మాత్రం చేస్తామని అక్కడి ప్రధాని ప్రకటించారు. దీనికి సంబంధించిన చర్యలను ఆయన వెల్లడించారు. 

సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఇతర ప్రాంతాల్లో ప్రయాణం, ప్రజల వ్యాయామం కోసం పార్కులు, గార్డెన్లు తెరవడం..అతి తక్కువ మందితో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతినించనున్నారు. బార్లు, రెస్టారెంట్లు ఆన్‌లైన్‌ ద్వారానే అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. అంత్యక్రియలకు 15 మందికి మించి హాజరుకారాదు.(ఇండియాలో కరోనా..మృతులు 1, 075 : మహారాష్ట్ర విలవిల..ఒక్కరోజే 583 కేసులు)

సన్‌బాతింగ్, క్రీడలను అనుమతించరు. మే 18వ తేదీ నుంచి రిటైల్‌ షాపింగ్, మ్యూజియంలు, లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాలు..జూన్‌ ఒకటవ తేదీ నుంచి బార్లు, రెస్టారెంట్లు, హేర్‌ డ్రెసర్స్, వెల్‌నెస్‌ సెంటర్లు తెరువనున్నారు. కానీ..అన్ని వేళల, అన్ని చోట్ల మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం షరతులు విధించింది. సెప్టెంబర్‌ నెల నుంచి విద్యా సంస్థలను తెరవాలని, నైట్‌క్లబ్బులను, సినిమా హాళ్లను, మత కార్యక్రమాలను అనుమతించాలని నిర్ణయించింది. 

లాక్ డౌన్ సడలింపుల విషయంలో విమర్శలు వస్తున్నా..నిర్ణయించిన ప్రకారం ముందుకెళ్లాలని ఇటలీ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఇటలీ తరహాలో లాక్ డౌన్ సడలింపులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ మే 03వ తేదీతో ముగుస్తుండడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాలంటే..ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే.