ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి భారత్..

ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి భారత్..

ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌ను కోహ్లి సేన వెనక్కి నెట్లేసి.. అగ్రస్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్స్‌ ప్రకారం టీమిండియా 122 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానానికి చేరగా, న్యూజిలాండ్‌ 118 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది.

ఆస్ట్రేలియా 113 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌ 105 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి.

వరల్డ్‌ టెస్ట్ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో కూడా భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌‌లో భాగంగా 2019-2021 మధ్య కాలంలో టీమిండియా 17 టెస్టులు ఆడి 12 విజయాలు సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒకదాన్ని మాత్రం డ్రా చేసుకుంది.

ఫలితంగా ఐసీసీ ప్రవేశపెట్టిన పర్సంటేజ్‌ ఆఫ్‌ పాయింట్లలో 72.2 శాతం విజయాలను ఖాతాలో వేసుకుని టీమిండియా టాప్‌కు చేరింది. ఇక్కడ న్యూజిలాండ్‌ 11టెస్టులకు గాను 7 విజయాలు, 4 ఓటములు చవిచూసింది. దాంతో కివీస్‌ విజయాల శాతం 70.0గా నమోదైంది. లార్డ్స్‌లో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.