Mega Naval Drill : భారత్​-అమెరికా మెగా నేవల్ డ్రిల్ ప్రారంభం

హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరిగే భారత్​-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

Mega Naval Drill : భారత్​-అమెరికా మెగా నేవల్ డ్రిల్ ప్రారంభం

Mega Naval Drill

Mega Naval Drill హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరిగే భారత్​-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాలకు చెందిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు హిందూ మహా సముద్రంలో జరిగిన విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే ఈ ప్రాంతంలో చైనా ఆగడాలకు చెక్​పెట్టేందుకు ఈ విన్యాసాలను చేపట్టినట్లు తెలుస్తోంది.

అణ్వాయుధ సామర్థ్యంగల విమాన వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ నేతృత్వంలో నావల్ కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌ను అమెరికా మోహరించింది. వీటితోపాటు ఎఫ్-18 యుద్ధ విమానాలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలయ్యే ఈ-2సీ హాక్ఐ విమానాలను కూడా విన్యాసాల కోసం అమెరికా మోహరించింది. నిమిట్జ్ క్లాస్ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్, ఆర్లీగ్ బుర్కే క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ హాల్సీ, టికొండెరొగ క్లాస్ గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ షిలోహ్ అమెరికా కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌లో ఉన్నాయి. విమాన వాహక నౌక, పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్, ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కేరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కేరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. యుద్ద నౌకలను, మర్చంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రిగేట్స్ అంటారు. జలాంతర్గాములు, విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే, వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు.

ఇక, భారత్ మోహరించిన వాటిలో జాగ్వార్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్​ చేసే ఐఎల్-78 యుధ్ధ విమానం, అవాక్స్ (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) విమానాలు ఉన్నాయి. వీటితోపాటు పీ8ఐ సముద్ర నిఘా విమానాలను, మిగ్29కే యుద్ధ విమానాలను మోహరించింది. ఐఎన్​ఎస్​ కోచి, ఐఎన్​ఎస్​ టెగ్​ యద్ధనౌకలను భారత్ మోహరించింది.

కేరళలోని తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం సహా సముద్రతీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం ఈ రెండురోజుల విన్యాసాలను చేపడుతున్నట్లు భారత నౌకాదళ ప్రతినిధి​ వివేక్​ మాద్వాల్​ తెలిపారు. భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, భారత వాయు సేనకు చెందిన యుద్ధ విమానాలు.. అమెరికాకు చెందిన కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌తో కలిసి సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.