భారత్ – ఇంగ్లండ్ టెస్టు సిరీస్, ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్

భారత్ – ఇంగ్లండ్ టెస్టు సిరీస్, ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్

India vs England 1st Test : ఆస్ట్రేలియా టూర్‌లో కంగారులను బిత్తరపోయేలా చేసిన టీమిండియా…ఇంగ్లండ్‌తో తలపడనుంది. స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2021, ఫిబ్రవరి 05వ తేదీ శుక్రవారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ టెస్ట్‌కు రిషబ్ పంతే కీపరని ప్రకటించాడు కెప్టెన్ కోహ్లీ. కరోనా వ్యాప్తితో ఏడాది గ్యాప్‌ వచ్చింది స్వదేశంలో టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు. ఏడాది తర్వాత సొంతగడ్డపై తొలి టెస్ట్‌ ఆడనుంది కోహ్లీ సేన. చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ఈ టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా గ్రౌండ్‌లో ముమ్మరంగా సాధన చేశాయి ఇరు జట్లు. గురువారం ఎక్కువగా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు అజింక్యా రహనే, చతేశ్వర్‌ పుజారా, రోహిత్‌ శర్మ, శుభమన్‌ గిల్‌ నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఇషాంత్‌, మహమ్మద్‌ సిరాజ్‌, బుమ్రా బౌలింగ్‌ సాధన చేశారు. వెన్నెముకకు శస్త్రచికిత్స అనంతరం తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేశాడు. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్ జస్పీత్‌ బుమ్రా తొలిసారి స్వదేశంలో టెస్ట్‌ ఆడనున్నాడు. ఇంతవరకు బుమ్రా ఆడిన 17 టెస్ట్‌లూ విదేశాల్లోనే కావడం విశేషం. 2018లో సౌతాఫ్రికాలో తొలి టెస్ట్‌ ఆడిన బుమ్రా ఇంతవరకు 21 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు. ఈ విశేషాలను ప్రస్తావిస్తూ బుమ్రా ఇండియాలో తొలి టెస్ట్‌ ఆడనున్నాడా అంటూ ఐసీసీ ఎమోజీని ట్వీట్ చేసింది.

5 సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శన చేసిన బుమ్రా..స్వదేశంలో ఆడనున్న తొలి టెస్ట్‌లోనూ రాణిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఇటు కీపింగ్‌, అటు బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్నందున రిషబ్‌పంత్‌కే.. తొలి టెస్ట్‌లో వికెట్ కీపర్‌గా ఛాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. వైఎస్‌ కెప్టెన్‌ రహానేతో చక్కని ఫ్రెండ్‌షిప్‌ ఉందన్న కోహ్లీ.. జట్టును విజయతీరాలకు చేర్చడంపై ఎప్పటికప్పుడు చర్చిస్తామన్నాడు. సిరీస్‌ ఆరంభం కావడానికి రెండ్రోజులు ముందు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఒలీ పోప్‌ను టీమ్‌లో చేర్చింది ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు. గతేడాది ఆగస్టులో పాకిస్థాన్‌తో సిరీస్‌లో భుజానికి గాయమవడంతో జట్టుకు దూరమైన పోప్‌..ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. తొలి టెస్ట్‌కు ముందే ఇంగ్లండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జాన్‌ క్రాలే చెన్నైలో జరిగే రెండు టెస్ట్‌లకూ దూరమయ్యాడు. చెపాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో జారి కిందపడడంతో.. క్రాలే కుడి చేతి మణికట్టుకు తీవ్రగాయమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు చెన్నై వేదికగా నిలిచింది. తొలి టెస్ట్‌కు ఫ్యాన్స్‌ను అనుమతించట్లేదు. కానీ రెండో టెస్టు నుంచి మైదానంలోకి అభిమానులను అనుమతించనున్నారు.