స్కూల్ భవనాలు లేని విద్యార్ధుల..ఖాళీగా పడి ఉన్న రైళ్లు : బోగీలను బడులుగా మార్చేస్తే పోలా..తెరపైకి కొత్త ప్రతిపాదన

స్కూల్ భవనాలు లేని విద్యార్ధుల..ఖాళీగా పడి ఉన్న రైళ్లు : బోగీలను బడులుగా మార్చేస్తే పోలా..తెరపైకి కొత్త ప్రతిపాదన

Indian Railways Train Schools :  స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో నిలిచిపోయిన రైళ్లు ఓ మూలకు పడి ఉన్నాయి. రైళ్లు అడపాదడపా తిరుగుతున్నాయి గానీ పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు జరగటం లేదు. దీంతో సర్వీసులు లేకుండా నిలిచిపోయిన రైళ్లనే స్కూళ్లుగా మార్చేస్తే ఎలా ఉంటుంది? అనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దీని కోసం ‘రైళ్లే స్కూళ్లు’ అనే కొత్త కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. త్వరలో అమలుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో కరోనా వచ్చాక…చాలా రైళ్లు సర్వీసులు అందించట్లేదు. దీంతో రైళ్లన్నీ ఓ పనీ పాటా లేకి ఓ మూలన పడి ఉన్నట్టుగా ఉన్నాయి. అలా ఉన్న వాటిని స్కూళ్లుగా మార్చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. కానీ ఈ ఆలోచనలు ఎంతవరకూ పట్టాలెక్కుతాయో మరి ఆ వివరాలేమిటో చూద్దాం..

దేశలో కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో రైళ్ల బోగీలను ‘హోమ్ ఐసోలేషన్ రూములు’గా మార్చారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వాడకుండా ఉన్న రైలు బోగీలను స్కూలు తరగతి గదులుగా మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖను కోరుతోంది. ఇలా అడగడానికి బలమైన కారణం కూడా ఉంది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల చాలా రైళ్లు ఖాళీగానే ఉంటున్నాయి. సర్వీసులు లేక… అవి అలాగే పాడైపోతాయేమో అనిపించేలా ఉన్నాయి. కొన్నైతే… ప్రయాణించేందుకు పనికిరావని రైల్వే అధికారులు పక్కన పడేసి ఉంచారు. అటువంటివి తమకు ఇస్తే వాటిని స్కూల్ తరగతులుగా మార్చుకుంటామని SDMC ప్రతిపాదన పెట్టింది.

దీని గురించి దక్షిణ ఢిల్లీ మేయర్ అనామికా మాట్లాడుతూ..ఇది చక్కటి ఆలోచన..ఎలాగూ ఆ బోగీలను పక్కన పెట్టేశారు. వాటిని తిరిగి వాడే పరిస్థితి కూడా లేదు. అవి అలా మూలన పడి ఉండే బదులు మాకు ఇస్తే… స్కూళ్లుగా, చెత్తను పారేసేందుకు, టాయిలెట్ సదుపాయాలు కల్పించేందుకు వాడుకుంటామని తెలిపారు.

దీని గురించి అనామికా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో వర్చువల్ మీటింగ్ జరిపారు.ఈ సందర్భంగా ఆమె మంత్రి వద్ద ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. వినియోగించకుండా పడి ఉన్న రైలు బోగీలు తమకు ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి గోయల్ కూడా అంగీకరించారనీ… వీలైనంత త్వరగా ఇస్తామని హామీ ఇచ్చారని మేయర్ అనామికా తెలిపారు.

అలాంటి బోగీలు, కంటైనర్లతో పలు కాలనీల్లో వాటి దావారా హెల్త్ కేర్ సదుపాయాలు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుందని..పలు కాలనీలకు ఆస్పత్రి, విద్యా సదుపాయాలు లేవని తెలిపారు. ఎప్పుడైతే తమకు దగ్గర్లోనే స్కూలు ఉంటుందో… పిల్లలు కూడా స్కూలుకు రావటానికి ఆసక్తి చూపుతారని..ఉపయోగం లేకుండా పడి ఉన్న బోగీలు ఇలా ఉపయోగపడతారని ఆమె అభిప్రాయపడ్డారు.

రైలు కంటైనర్లు, బోగీల చిన్న పాటి బడ్జెట్‌తో తగిన మార్పులు చేసి… కార్పొరేషన్ సిబ్బందిని కూడా సేవలందించేందుకు కేటాయిస్తామని అనామికా తెలిపారు. రైల్వే ట్రాకులు, భూమిని కూడా ఇవ్వాలని రైల్వే శాఖను కోరామని తెలిపారు. అక్కడ టాయిలెట్ సదుపాయాలను కల్పించి… స్థానికులు వాటిని వాడుకునేలా చేస్తామన్నారు. దీని వల్ల కాలనీలు పరిశుభ్రంగా ఉంటాయని..తద్వారా ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత ఏర్పడటంతో పాటు ఆరోగ్యకర కాలనీలు ఏర్పాటు అవుతాయని మేయర్ అనామికా అభిప్రాయపడ్డారు. మేయర్ అనామికా చేసిన ప్రతిపాదన ‘రైళ్లే స్కూళ్లు’అనే కాన్సెప్టుకి మంచి మద్ధతు లభిస్తోంది.

కాగా..రైల్వే శాఖకు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా వదిలేసిన బోగీలు, కంటనర్లు చాలానే ఉన్నాయి. వాడని ట్రాకులు కూడా ఉన్నాయి. మరి SDMCకి మాత్రమే రైల్వే శాఖ బోగీలు ఇస్తుందా… లేక దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇస్తుందా అనేది త్వరలో తేలనుంది.