కట్నానికి బదులుగా పుస్తకాలు తీసుకున్న వధువు..మార్పుకు మొయినా స్ఫూర్తి అంటూ ప్రశంసలు

కట్నానికి బదులుగా పుస్తకాలు తీసుకున్న వధువు..మార్పుకు మొయినా స్ఫూర్తి అంటూ ప్రశంసలు

bengal bride Books as mohor : సాధారణంగా వధువు తరపువారు వరుడికి వరకట్నం ఇస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆయా మతాల సంప్రదాయం ప్రకారం వరుడి నుంచి వధువుకు కట్నం ఇస్తారు. అటువంటి ఓ పెళ్లిలో వధువు కట్నంగా డబ్బులు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ కట్నం డబ్బులకు బదులుగా పుస్తకాలను కట్నంగా తీసుకంది.పైగా ఆ వధువు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన యువతి కావటం మరో విశేషం..సాధారణంగా మైనార్టీ సామాజిక వర్గం కుటుంబాల్లో వధువుకు ఎటువంటి స్వేచ్ఛా ఉండదు. పెద్దలు చేసుకోమన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. కానీ కట్నానికి బదులుగా పుస్తకాలను కట్నంగా తీసుకున్న వధువు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పశ్చిమబెంగాల్ లో జరిగిన ఈ ఆదర్శనీయమైన పెళ్లి తెలుసుకోవాల్సిందే..

భారతదేశంలో జరిగే పెళ్లిళ్లు ఆయా సామాజిక వర్గాలు..ఆయా ప్రాంతాల సంప్రదాయాలను బట్టి జరుగుతుంటాయి. అలా పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు కన్యాశుల్కం అమలులో ఉండేది. కానీ..ఇప్పుడు కన్యాశుల్కం కాస్త వరకట్నంగా మారింది. పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది. దాన్నే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు.

బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో కళ్యాణి విశ్వవిద్యాలయంలో చదువుతున్న మొయినా ఖాటూన్ అనే యువతి ఇటీవలే వివాహం చేసుకుంది. ఈ వివాహం టాక్ ఆఫ్ ది స్టేట్ గా చర్చనీయాంశమైంది. మైనార్టీ ఆధిపత్యం ఉండే ఏరియాలో 24 ఏళ్ల వధువు తనకు వరుడి తరపున ఇచ్చే కట్నం ‘మహర్’ (బెంగాలీలో ‘మోహోర్’) వద్దని దానికి బదులుగా పుస్తకాలు ఇవ్వాలని కోరింది. అది విన్న వరుడి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఆ తరువాత అర్థం చేసుకుని తమ కోడలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. అలా ఆమె కోరిన పుస్తకాలను బహుమతిగా అందించి గత సోమవారం (ఫిబ్రవరి 1,2021) మొయినా సొంత గ్రామమైన కిద్దేర్పోర్‌లో వివాహం జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పుస్తకాలను కట్నంగా తీసుకున్న వధువు పేరు మొయినా ఖాటున్. కల్యాణీ యూనివర్సిటీలోని DN కాలేజీలో ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ చేస్తోంది. మైనార్టీ ఆధిపత్యం ఉండే ఏరియాలో ఆ 24 ఏళ్ల వధువు నిర్ణయాన్ని వరుడు బీహార్‌లోని భాగల్పూర్ యూనివర్శిటీలో జాగ్రఫీ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల మీర్జానూర్ రెహ్మాన్ అంగీకరించాడు. జనవరిలో ఈ పెళ్లిని పెద్దలు కుదుర్చుతున్న సమయంలోనే మొయినా… తన నిర్ణయాన్ని పెద్దలకు చెప్పింది. సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నా…తమ కోడలు తీసుకున్న నిర్ణయం సముచితమైనదే కావటంతో వారుకూడా ఆనందంగా స్వాగతించారు.

పెళ్లి తర్వాత వధువు తరపు కుటుంబ సభ్యులంతా పుస్తకాలతో కనిపించారు. వధువుకు ఇచ్చిన పుస్తకాల్లో బెంగాలీ ఖురాన్, రవీంద్రనాథ్ ఠాకూర్, నజ్రుల్ ఇస్లామ్, విభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ రచనలు ఉన్నాయి. మైనార్టీ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఓ ఆడపిల్ల అటువంటి నిర్ణయం తీసుకుందని తెలిసిన అందరూ ప్రశంసించారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసింది. మైనార్టీ అమ్మాయిల్లో వస్తున్న మార్పు, సమాజంలో వస్తున్న మార్పులకు ఇటువంటి ఘటనలు స్ఫూర్తినిస్తాయని అన్నారు. మొయినా లాగా ఆదర్శప్రాయ నిర్ణయాలు తీసుకొని… సమాజాన్ని ప్రభావితం చెయ్యగలరని అభిప్రాయపడ్డారు. మొయినా తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక పత్రికలు ఆమెను ప్రశంసిస్తూ కథనాలు ప్రచురించాయి.