ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉందా ?… విద్యాశాఖను ప్రశ్నించిన హైకోర్టు

  • Published By: bheemraj ,Published On : July 2, 2020 / 02:19 AM IST
ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉందా ?… విద్యాశాఖను ప్రశ్నించిన హైకోర్టు

కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కానందున ప్రైవేటుస్కూళ్ల ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వ వైఖరేమిటని విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఉందా? లేదా? చెప్పాలని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ హైదరాబాద్‌ స్కూల్స్‌ స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై చీఫ్‌జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌ హాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం (జులై 1, 2020) విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల విద్యార్థులు భౌతిక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, ఇది ఆర్టికల్‌ 21 ఏ, బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009కి విరుద్ధమన్నారు. ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలుచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఆన్‌లైన్‌ తరగతుల వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో) పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వవిధానం తెలియజేయాలని విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ ప్రాంతీయ విద్యాధికారులకు, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంపై రాష్ట్రంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈనేపథ్యంలో డీఈవోలు ఆన్‌లైన్‌ తరగతులపై స్కూల్‌ యాజమాన్యాలకు ఎలాంటి ఆదేశాలు జారీచేయవద్దని సూచించారు. విద్యాశాఖ కమిషనర్‌ నిర్ణయాల ప్రకారం డీఈవోలు జిల్లాల వారీగా చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.

Read:తెలంగాణ గవర్నమెంట్‌పై హైకోర్టు సీరియస్