IT Raids In Malla Reddy House: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ సోదాలు.. పెద్ద కుమారుడికి స్వల్ప అస్వస్థత.. అధికారులపై మంత్రి ఆగ్రహం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండవ రోజు బుధవారంకూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఐటీ సోదాలు ప్రారంభంకాగా.. సాయంత్రానికి రూ. ఐదు కోట్లు నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

IT Raids In Malla Reddy House: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ సోదాలు.. పెద్ద కుమారుడికి స్వల్ప అస్వస్థత.. అధికారులపై మంత్రి ఆగ్రహం

Minister Mallareddy

IT Raids In Malla Reddy House: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసంలో, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్న అధికారులు బుధవారంసైతం సోదాలు కొనసాగిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామునే ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. ఇదిలాఉంటే మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయన్ను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆస్పత్రిలో ఉండటంతో పరామర్శించేందుకు తన నివాసం నుంచి బయలుదేరిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. మల్లారెడ్డి వారిని ఆస్పత్రికి వెళ్లి కొడుకును పరామర్శించి వస్తానని కోరినప్పటికీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఐటీ అధికారుల తీరుపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, 200 మంది అధికారులను మా ఇళ్లపైకి పంపి దౌర్జన్యం చేస్తున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా దొంగ వ్యాపారం చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. రాతంత్రా నా కుమారుడిని ఇబ్బంది పెట్టారని, నా కుమారుడిని కొట్టినట్లున్నారు, అంతా డ్యామేజ్ చేస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

IT Raids On Malla Reddy : తలుపులు బద్దలు కొట్టి మరీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

మంగళవారం తెల్లవారు జామున ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడు, బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. వ్యాపార భాగస్వాములు గంగాధర్ యాదవ్, నర్సింహ యాదవ్, క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు.. న్యూ బోయిన్ పల్లి జయనగర్ కాలనీలో మల్లారెడ్డి నివాసంలో అధికారులు సోదాలు చేశారు. ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి, సమీపంలోని సౌజన్య కాలనీలో నివసించే మంత్రి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి, సీతారాంపురంలో నివసించే వ్యాపార భాగస్వామి నర్సింహయాదవ్, చిన్నతోకట్టలో నివసించే చిట్ ఫండ్ వ్యాపారి గంగాధర్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. అదేవిధంగా కొంపల్లి పురపాలిక పరిధిలోని ఫాం మెడోస్ లో నివాసముంటున్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అక్కడే సమీపంలో ఉంటున్న మరో కుమారుడు భద్రారెడ్డిల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే మర్రి రాజశేఖరరెడ్డి మినహా మిగిలిన వారంతా సోదాల సమయంలో వారివారి ఇళ్లలోనే ఉన్నారు.

Malla Reddy IT Raids : కట్టల కట్టల డబ్బు.. మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు సీజ్

మంగళవారం నిర్వహించిన దాడుల్లో ఐటీ అధికారులు రూ. ఐదు కోట్లు నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మర్రి రాజశేఖరరెడ్డి దంపతులు విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన కుమార్తె, మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రేయారెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన ఇంట్లో అర్థరాత్రి వరకు సోదాలు చేసిన అధికారులు సుమారు రూ. 4కోట్లు నగదును గుర్తించారు. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.