Ramappa Temple: బీ అలెర్ట్.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సమయమిదే!

రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు దక్కింది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కాకతీయుల నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న చారిత్రక కట్టడం రామప్ప ఆలయంగా ఇప్పుడు ప్రపంచస్థాయి ఖ్యాతి దక్కింది.

Ramappa Temple: బీ అలెర్ట్.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సమయమిదే!

Ramappa Temple

Ramappa Temple: రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు దక్కింది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కాకతీయుల నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న చారిత్రక కట్టడం రామప్ప ఆలయంగా ఇప్పుడు ప్రపంచస్థాయి ఖ్యాతి దక్కింది.

ఆలయంపై కనువిందుచేసే శిల్ప సౌందర్య రాశులు, సప్త స్వరాలు పలికే స్తంభాలు, చూపరులను ఆకట్టుకునే నంది విగ్రహం, పరవశింపజేసే ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది రామప్ప ఆలయం 800 ఏళ్ల సంస్కృతీ, సంప్రదాయాలకు దర్పణం పడుతూ చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతుంది. యునెస్కో గుర్తింపుకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా కృషి చేశాయో ఇప్పుడు అంతకు మించి జాగ్రత్తగా మసలుకొని ఈ గుర్తింపును కాపాడుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఆలయాన్ని ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి.

రామప్ప శివాలయం కావటంతో కార్తీక మాసంలో భక్తులు తండోపతండాలుగా వచ్చి దీపాల జాతర, ఆలయంలో ఎక్కడపడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహాలపై పసుపు, కుంకుమలు, విభూతి చల్లడం వంటివి చేస్తుంటారు. ఇక ముందు ఇవన్నీ యునెస్కో గుర్తింపునకు సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా యునెస్కో రూపొందించిన విధివిధానాలను ఆచరించేలా చూసుకోవాల్సి ఉంటుంది. పూజలు అందుకునే విగ్రహాల వద్ద, అర్చకులు పసుపు కుంకుమలు, పూలతో పూజతో పాటు.. అక్కడే దీపాలు వెలిగించాలి తప్ప ఇతరచోట్ల అలా చేయకూడదు.

ఇక కట్టడానికి వంద మీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా యునెస్కో నిబంధన ఉండగా ఆ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా జరగటానికి వీల్లేదు. నిషేధిత ప్రాంతానికి అవతల మరో వంద మీటర్ల ప్రాంతాన్ని నియంత్రిత పరిధి కాగా.. ఆ పరిధిలో నిబంధనల ప్రకారం అనుమతి పొంది కొన్ని కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అయితే, అవి ఆలయానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు.

రామప్ప ఆలయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) పరిధిలో ఉండగా దాని వెలుపల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇకపై కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య పూర్తి సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే యూనెస్కో తమ గుర్తింపును వెనక్కు తీసుకున్నా ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. గతంలో పలు సందర్భాల్లో ఇలా గుర్తింపు రద్దు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.