మా సైనికులు కరోనానే లెక్క చెయ్యలేదు, జగన్ ఓ లెక్కా..

మా సైనికులు కరోనానే లెక్క చెయ్యలేదు, జగన్ ఓ లెక్కా..

janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందని, ప్రలోభాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఫ్యాక్షన్ రాజకీయాలతో బెదిరించి ఓట్లు వేయించుకోవాలని వైసీపీ సర్కారు చూస్తోందని, దాన్ని ఎదుర్కొనే శక్తి ఒక్క జనసేన పార్టీకి మాత్రమే ఉందని నాదెండ్ల స్పష్టం చేశారు. మా జనసైనికులు కరోనాకే భయపడలేదు, ఇక జగన్ కు ఎందుకు భయపడతారని నాదెండ్ల అన్నారు.

గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయగా, ఈ పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలిచింది పవన్ కల్యాణ్, జనసైనికులేనని నాదెండ్ల చెప్పారు. పవన్ పిలుపుతో యువత ఎంతో ధైర్యంగా ముందుకొచ్చిందని, అభ్యర్థులు లేని ప్రాంతాల్లో రాత్రికి రాత్రే తమ భార్యలను, తల్లులను పోటీలో నిలబెట్టారని నాదెండ్ల వివరించారు. గతంలో టీడీపీ కూడా జన్మభూమి కమిటీలతో ఇలాంటి పరిస్థితులనే సృష్టించిందన్నారు. ప్రభుత్వ పథకాలు దక్కాలంటే ఓట్లు వేస్తామని సంతకాలు చేయాలని విసిగించారని ఆరోపించారు. దాంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారని వెల్లడించారు.

”పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు. నాడు కరోనాని లెక్క చేయని జనసైనికులు.. జగన్ రెడ్డిని లెక్క చేస్తారా? పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపుతో యువత ఎంతో ధైర్యంగా నిలబడింది. అభ్యర్ధులు లేని చోట్ల రాత్రికి రాత్రి తమ భార్యలు, తల్లులను నిలబెట్టుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని దమ్మాలపాడులో రాళ్లదాడి చేశారు. 15 కుట్లు పడి ఆసుపత్రిలో చేరారు మన జన సైనికులు. ఆ పరిస్థితిలో సైతం 38 ఓట్ల తేడాతో సర్పంచ్ ని గెలిపించుకున్నారు” అని నాదెండ్ల చెప్పారు.

ప్రస్తుత సీఎం జగన్ కూడా ఒక్క చాన్స్ అంటూ వచ్చి, గెలిచాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు టార్గెట్లు పెట్టడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులు కూడా జిల్లాల వెంటబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గ్రామాల్లోని పరిస్థితుల దృష్ట్యా ఇతరుల మద్దతు తీసుకున్న సందర్భాలు కొన్ని ఉండొచ్చని, కానీ టీడీపీతో మాత్రం తమకు ఎక్కడా సంబంధం లేదని నాదెండ్ల స్పష్టం చేశారు.

”ఎన్నికల ప్రక్రియ మీద యువత అవగాహన తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ ఏజెంట్ అంటే ఏంటి, కౌంటింగ్ ఏజెంట్ అంటే ఏంటి అన్న అవగాహన తెచ్చుకోవాలి. మొదటి విడత నుంచి నాలుగో విడత వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే ఎంతో మార్పు వచ్చిందన్న విషయం అర్ధమవుతుంది. ఆర్ధికంగా స్థోమత లేకపోయినా పోటీ చేశారు, ఓట్లు అడిగారు. కేవలం రూ.35 వేల ఖర్చుతో ఎన్నికల ప్రక్రియ ముగించిన ఘనత జనసేన పార్టీ అభ్యర్ధులకే దక్కుతుంది” అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

పంచాయతీల ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా వాసులు జనసేనకు గొప్ప తీర్పును ఇచ్చారని నాదెండ్ల మనోహర్ అన్నారు. నిజాయితీగా ప్రజల కోసం…ప్రజల సమస్యల పైన పోరాడే జన సైనికులు విజయం సాధించారని తెలిపారు. రాజకీయ ప్రస్థానంలో రాబోయే రోజుల్లో జనసేన నిలబడడం కోసం.. మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్‌పై ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. జనసేనాని పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

సోమవారం(ఫిబ్రవరి 22,2021) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని పంచాయితీ ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.