వ్యాక్సిన్ పని చేయదు, వేగంగా వ్యాపిస్తుంది.. వణికిస్తున్న కొత్త రకం కరోనా

వ్యాక్సిన్ పని చేయదు, వేగంగా వ్యాపిస్తుంది.. వణికిస్తున్న కొత్త రకం కరోనా

japan finds new covid 19 strain: చైనాలోని వుహాన్‌లో తొలుత వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ఏడాదికిపైగా యావత్ ప్రపంచాన్ని వణికించింది. అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏడాదికిపైగా ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్న దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో కొత్తరకం కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. యూకేలో బయటపడిన కరోనా స్ట్రెయిన్ ఆ దేశంతో పాటు బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, ఆసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా జపాన్‌లోనూ కొత్త రకం కొవిడ్ బయటపడింది.

తమ దేశంలో మరో కొత్త కరోనా వైరస్‌ రకాన్ని గుర్తించినట్లు జపాన్‌ స్వయంగా అనౌన్స్ చేసింది. తూర్పు జపాన్‌లోని కాంటేలో 91 కేసులు, ఎయిర్ పోర్టుల్లో రెండు కేసులు నమోదైనట్టు తెలిపింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు టోక్యో ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఓ ఇన్ఫెక్షన్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. జపాన్‌లో వెలుగుచూసిన కొవిడ్‌ రకాల కంటే ఇది విభిన్నంగా ఉందని.. ఇది వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉంటుందని జపాన్ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ వెల్లడించింది.

వ్యాక్సిన్‌ పనితీరును దెబ్బతీసే E484K మ్యుటేషన్‌ను, ఈ కొత్త రకం కరోనా వైరస్‌లో కూడా కనుగొన్నామని సైంటిస్టులు తెలిపారు. ఇప్పటివరకు వెల్లడైన రకాల కంటే కూడా ఈ కొత్త వైరస్‌ మరింత త్వరగా వ్యాపించవచ్చని.. దీంతో దేశంలో కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. పరివర్తన చెందిన ఈ కొవిడ్‌ వైరస్‌ కూడా వ్యాక్సిన్లకు లొంగకపోయే అవకాశమున్నందున జపాన్‌ ప్రభుత్వం మరింత అలర్ట్ అయ్యింది. జపాన్ లో టీకా పంపిణీ కార్యక్రమం ఈ వారమే ప్రారంభమైంది. ఇంతలోనే కొత్త రకం వైరస్ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.