జపాన్ లో ఆర్థిక మాంద్యం…ఒక్కొక్కరికీ 70వేల నగదు ప్రకటించిన ప్రభుత్వం

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 10:40 AM IST
జపాన్ లో ఆర్థిక మాంద్యం…ఒక్కొక్కరికీ 70వేల నగదు ప్రకటించిన ప్రభుత్వం

ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న జపాన్ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2015కి ముందు జపాన్‌లో ఆర్థిక మాంద్యం ఉంది. ఆ సమయంలో కోలుకున్న జపాన్ లో మళ్లీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్లు సోమవారం(మే-18,2020)షింజో అబే ప్రభుత్వం డేటా విడుదల చేసింది. జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం…గత క్వార్టర్ తో పోలిస్తే 2020-21 మొదటి క్వార్టర్‌(జనవరి-మార్చి)లో వృద్ధి రేటు  0.9 శాతం తగ్గింది.

అయితే ఎనలిస్ట్(విశ్లేషకులు)లు అంచనా వేసిన 1.2శాతం తగ్గుదల కంటే కొంచెం బెటర్ గానే ఉంది. వరుసగా రెండు క్వార్టర్లో జపాన్ లో వృద్ధి రేటు తగ్గింది. రెండు క్వార్టర్లలో నెగెటివ్ వృద్ధి రేటు వస్తే… దాన్ని ఆర్థిక మాంద్యంగా జపాన్ లెక్కిస్తోంది. పన్నుల పెంపు, తుఫాన్ల దాడి వంటి అంశాలు అందుకు కారణం అయ్యాయి. ఆ తర్వాత కరోనా దెబ్బకు కార్యకలాపాలన్నీ నిలిచిపోయి ఆర్థికవ్యవస్థ అతలాకుతలం అయింది. జపాన్‌లో ఇవి టూరిజం రోజులు. కరోనా పుణ్యమా అని 90 శాతం టూరిజం పడిపోయింది. టోక్యో 2020 ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

తగ్గిన కొనుగోళ్లు..నిలిచిన ప్రొడక్షన్

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లలో ఉంటున్న జపాన్ ప్రజలు పెద్దగా ఐటెమ్స్ కొనట్లేదు. దీంతో కంపెనీలకు డబ్బు రావట్లేదు. ఫలితంగా అవి కొత్త వస్తువుల ఉత్పత్తి తగ్గించాయి. ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. ఇలా రివర్స్ సైకిల్ నడుస్తోంది. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఇది ఉంది. జపాన్‌లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్ GDPలో సగానికి పైగా ఉండే వ్యక్తిగత వినియోగం(Personal consumption)0.7శాతం పడిపోయింది. జపాన్ ఎకానమీకి పిల్లర్లుగా ఉన్న టొయోటా మోటర్ కార్పొరేషన్ వంటి మ్యానుఫ్యాక్చరర్స్ నిరాశాజనకమైన ఆర్థిక ఫలితాలను రిపోర్ట్ చేశాయి. కొన్నికంపెనీలు అయితే ఈ ఆర్థికసంవత్సరానికి అంచనాలను అందించలేకపోయాయి. ప్రజల కొనుగోలు చేయడం తగ్గడంతో కొన్ని ఫ్లాంట్ లలో అయితే ప్రొడక్షన్(ఉత్పత్తి)నిలిపివేశారు. వరల్డ్ వార్-2నుంచి ఇదే దేశంలో అతిపెద్ద సవాల్ అని జపాన్ ఎకానమిస్ట్ లు చెబుతున్నారు.

1ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ..ప్రజల చేతికి నగదు 

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు జపాన్ ప్రభుత్వం ఇటీవల 76లక్షల కోట్ల(1ట్రిలియన్ డాలర్లు) ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. చిన్న వ్యాపారులకు సహాయం చేయడం,జపాన్ ప్రజలకు ఒక్కొక్కరికీ రూ.70వేలు ఇవ్వడం వంటివి ఆ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. చేతికి వచ్చే డబ్బును ప్రజలు ఖర్చు పెడితే… అప్పుడు ఎకానమీ పరుగులు పెడుతుందని షింజో అబే భావిస్తున్నారు.జపాన్ మున్ముందు మరింత నెగెటివ్ లోకి వెళ్తుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కరోనా ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు లేకపోవడంతో… ఈ పరిస్థితి వస్తుందంటున్నారు.  

తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

జపాన్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. జపాన్ లో 16,285 కరోనా కేసులు ఇప్పటివరకు నమోదుకాగా,744మరణాలు నమోదయ్యాయి. ఇక రికవరీ రేటు జపాన్ లో బాగానే ఉంది. దేశంలో 11,153మంది కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతానికి జపాన్ లో యాక్టివ్ కేసులు 4388 మాత్రమే ఉన్నా… కొత్త కేసుల నమోదు, మరణాలు వస్తూనే ఉన్నాయి. అయితే గత నెలలో ఒక దేశలో కేసుల సంఖ్య రోజుకి 600-800 మధ్య ఉండగా,ప్రస్తుతం రోజూ 100లోపే కొత్త కేసుల నమోదు ఉంది. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే రాజధాని టోక్యోలో వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. టోక్యో, ఒసాకాలో లాక్‌ డౌన్ అమల్లో ఉంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో గత వారం ఎమర్జెన్సీని ఎత్తివేశారు.

Read : మాస్క్ పెట్టుకోకపోతే రూ.12.25లక్షలు జరిమానా..!జైలు కూడా : సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్