కరోనా డిప్రెషన్ తగ్గించటానికి..వీధుల్లో ‘చీర్ గర్ల్స్’ చిందులు

కరోనా డిప్రెషన్ తగ్గించటానికి..వీధుల్లో ‘చీర్ గర్ల్స్’ చిందులు

Japan ‘We want to deliver a smile’ : జపాన్ వీధుల్లో ‘చీర్ గర్ల్స్’ చిందులేస్తున్నారు. జపాన్ లో ఫుట్ బాల్ ఆటలు జరగట్లేదు.మనలా క్రికెట్ మ్యాచ్ లు జరగట్లేదు. మరి ఆటల్లో చిందులేసే చీర్ గర్ల్స్ వీధుల్లో డ్యాన్సులేయటమేంటీ? ఓ పక్క కరోనా మహమ్మారిని జనాలను హడలెత్తిస్తుంటే..వీళ్లిలా వీధుల్లో చిందులేస్తున్నారేంటీ అనే డౌట్ రావచ్చు.

వీళ్లంతా ఏదో సరదా కోసమో..లేదా డబ్బుల కోసమో చేయట్లేదు. కరోనా కల్లోలంతో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న క్రమంలో వారికి ఆనందాన్ని పంపచటానికి జపాన్ లో చీర్ గర్ల్స్ రంగంలోకి దిగారు. 2020లో ప్రపంచాన్ని కలవర పెట్టిన కరోనా వల్ల అక్కడి చీర్‌గర్ల్స్ వీధుల్లోకి వచ్చి చిందులేస్తున్నారు.

జపాన్‌లో కూడా కరోనా కలవరం తీవ్రమైంది. దీంతో లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతున్నాయి. ప్రజలు వైరస్ వల్ల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పని పనీ అంటూ బతికే జపాన్ వాసులు కరోనా మహమ్మారికి భయపడిపోతున్నారు. ఈ కల్లోలంతో జనాలకు ఉద్యోగాలు పోయాయి. ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా అసలే పనిరాక్షసులైన జపాన్ వాసులు డిప్రషన్‌కు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను కాసేపైనా కరోనా కష్టాల నుంచి మరపించేందుకు చీర్ గర్ల్స్ రంగంలోకి దిగారు.

జపాన్ గర్ల్స్ చీర్ క్లబ్‌కు చెందిన అమ్మాయిల టీమ్.. ప్రతీరోజూ టోక్యోలోని సింబాసీ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నిలుచుని డ్యాన్సులు చేస్తున్నారు. వచ్చిపోయే ప్రయాణికుల్లో ఆనందాన్ని, ధైర్యాన్ని నింపుతున్నారు. వైరస్ వల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ‘చీర్‌ఫుల్‌’గా ఉండాలని కోరుతున్నారు.

ఈ వీధుల్లో చిందులపై చీర్ క్లబ్ నిర్వాహకురాలు అసజుమా మాట్లాడుతూ..‘‘ప్రజలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఇంతటి ఒత్తిడి ఎదుర్కోలేదు.కరోనా వైరస్ వల్ల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఉపాధి పోయింది. దీంతో మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి వ్యక్తుల్లో చీర్ అంటే నవ్వు నింపి.. చీర్‌ఫుల్‌గా చేయటమే మా ఈ వీధుల్లో చీర్ గర్ల్స్ డ్యాన్సుల లక్ష్యం’’ అని తెలిపారు. మా ఈ ప్రయత్నం వల్ల కొంతలో కొంతైనా ప్రజల్లో ఒత్తిడి దూరమైతే మాకు అంతే చాలని తెలిపారు.

మెట్రో స్టేషన్‌లో కాకుండా కనగవా మున్సిపాలిటీ సమీపాల్లో కూడా చీర్ గర్ల్ డ్యాన్సులు చేస్తూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం జపాన్‌లో లాక్‌డౌన్ నిబంధనలు మరింత కట్టుదిట్టం చేశారు. యూకేలో పుట్టిన కరోనా స్ట్రయిన్ జపాన్‌కు సైతం వ్యాపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.