JBS – ADILABAD బస్సులో కరోనా రోగుల ప్రయాణం..ఆందోళనలో ప్రయాణీకులు

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 07:35 AM IST
JBS – ADILABAD బస్సులో కరోనా రోగుల ప్రయాణం..ఆందోళనలో ప్రయాణీకులు

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో నగర వాసులు ఇళ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే…కరోనా లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి…హడలెత్తించాడు. ఈ ఘటన జేబీఎస్ – ఆదిలాబాద్ బస్సులో చోటు చేసుకుంది.

కరోనా ఉందని తెలిస్తే..ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం లేదా హోం క్వారంటైన్ లో ఉండాలని స్పష్టంగా నిబంధనలు చెబుతున్నాయి. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటూ..ప్రయాణం చేశారు. ముగ్గురు వ్యక్తులు 2020, జులై 04వ తేదీ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జేబీఎస్ కు చేరుకున్నారు. సూపర్ లగ్జరీ (TS 08Z 0229) బస్సులో ఆదిలాబాద్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది.

వీరు నేరుగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తమకు కరోనా సోకిందని ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోరారు. వీరు నిర్మల్ నుంచి హైదరాబాద్ కు వచ్చారని తేలింది. దీంతో వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. బస్సులో ఎవరెవరు ప్రయాణించారనే దానిపై ఆరా తీస్తున్నారు. వీరంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.