లాక్‌డౌన్ ఎఫెక్ట్, గోల్డ్ షాపులో కూరగాయలు అమ్ముకుంటున్న నగల వ్యాపారి

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 11:58 AM IST
లాక్‌డౌన్ ఎఫెక్ట్, గోల్డ్ షాపులో కూరగాయలు అమ్ముకుంటున్న నగల వ్యాపారి

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ అనే అస్త్రాన్ని సంధించింది. ఈ అస్త్రం బాగానే పని చేసిందని చెప్పాలి. 130కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో కరోనా మరింత తీవ్రంగా విరుచుకుపడకుండా కట్టడి చేయగలిగామంటే లాక్ డౌన్ వల్లే సాధ్యమైందని చెప్పాలి. ఏ విధంగా చూసినా లాక్ డౌన్ కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించింది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు లాక్ డౌన్ కారణంగా జీవితాలు తారుమారు అయ్యాయి. బతుకులు భారంగా మారాయి. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చాలామంది వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పూట గడవటం కూడా కష్టంగా మారింది. 

కూరగాయల కొట్టుగా మారిన నగల దుకాణం:
లాక్ డౌన్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్ తో అన్ని వ్యాపారాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇది పెను ప్రభావమే చూపింది. కుటుంబపోషణ కోసం చాలామంది కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. లాక్ డౌన్ లో నిత్యవసరాలు, పాలు, పండ్లు, కూరగాయలు, మందుల అమ్మకాలకు మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీంతో అందరి దృష్టి వాటిపై పడింది. పండ్లు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నారు. కుటుంబసభ్యులకు తిండి పెడుతున్నారు. ఇంటి కిరాయిలు కడుతున్నారు.

నగల షాపులో కూరగాయలు:
ఓ నగల వ్యాపారి ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. తన నగల షాపుని కూరగాయల కొట్టుగా మార్చి, నగలు అమ్మిన అదే షాపులో కూరగాయలు విక్రయిస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లోని రామ్ నగర్ లో జీపీ జ్యువెలరీ దుకాణం కూరగాయల కొట్టుగా మారిపోయింది. ఇదివరకు బంగారు గొలుసులు, ఉంగరాలు అమ్మిన యజమాని గత నాలుగు రోజులుగా ఆలు గడ్డలు, టమోటాలు ఇతర కూరగాయలను విక్రయిస్తున్నాడు.

కుటుంబపోషణ కోసం కూరగాయల విక్రయం:
అతడి పేరు హుకుమ్ చంద్ సోని. చిరు నగల వ్యాపారి. ఇదివరకు చిన్నపాటి బంగారు ఆభరణాలను అమ్ముతూ, మరమ్మతులు చేస్తూ ఆదాయం పొందేవాడు. లాక్ డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి నా నగల దుకాణాన్ని మూసి ఉంచాల్సి వచ్చిందన్నాడు. దీంతో ఆదాయం లేకుండా పోయిందని వాపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించేందుకు ఉన్న ఏకైక మార్గం నా దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చడమే అని చెప్పాడు. ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నా అని తెలిపాడు. షాప్ కి రెంట్ చెల్లించాలని, నా తల్లిని, చనిపోయిన నా తమ్ముడి కుటుంబాన్ని పోషించాలని చెప్పాడు. ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పూట గడవదు కదా అని ఆ వ్యాపారి బోరుమన్నాడు.

కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు:
25ఏళ్లుగా నగల వ్యాపారం చేస్తున్న తాను, తన షాపులో ఇలా కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అందంగా తయారుచేసి ఉంచిన బంగారు ఆభరణాల స్థానంలో పచ్చని కూరగాయలు ఉంచి విక్రయించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేక, పూట గడవక కుటుంబాన్ని పోషించుకునేందుకు నగల దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆ వ్యాపారి వాపోయాడు.