జియో దూకుడు.. తగ్గేదే లేదు..

జియో దూకుడు.. తగ్గేదే లేదు..

టెలికాం రంగంలో భారీ పెట్టుబడులకు వెనుకాడేది లేదని రిలయన్స్ జియో మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో తన మార్క్‌ చూపించింది. స్పెక్ట్రమ్‌ కోసం మొత్తం 77 వేల 814 కోట్ల రూపాయల బిడ్లు దాఖలవ్వగా.. 57 వేల 122 కోట్లతో రిలయన్స్ జియో అత్యధిక మొత్తంలో బిడ్లు దాఖలు చేసింది.

ఈ వేలంలో 3 లక్షల 92 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 2 వేల 250 మెగా హెర్జ్ రేడియో తరంగాలను 7 బ్యాండ్లలో అందుబాటులో ఉంచారు. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలు 20 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చు. దీంతో భారీ మొత్తంలో బిడ్లు దాఖలు చేసిన జియో ఈ బ్యాండ్లలో టాప్‌గా నిలిచింది.

ఇక 18 వేల 669 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. సబ్‌ గిగా హెర్జ్‌ కేటగిరీలో 355 మెగా హెర్జ్‌ మిడ్‌ బ్యాండ్‌‌, 2 వేల 300 మెగాహెర్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో 5జీ సేవల్ని అందించేందుకు తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుందని తెలిపింది.

మరోవైపు, ఐదు సర్కిళ్లలో తాము దక్కించుకున్న స్పెక్ట్రమ్‌.. 4జీ కవరేజ్‌ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేయనుందని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ వెల్లడించింది. దీంతో మరింత నాణ్యమైన డిజిటల్‌ సేవల్ని అందించడంతోపాటు బిజినెస్ పెరిగే అవకాశం లభించనుందని తెలిపింది. ఒకప్పుడు స్పెక్ట్రమ్‌ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్‌ ఇప్పుడు మిగులు దేశంగా అవతరించిందని చెప్పింది. దీని వెనుక ప్రభుత్వ కృషి ఉందని కొనియాడింది.