154స్థానాల్లో బరిలోకి కమల్ పార్టీ..

154స్థానాల్లో బరిలోకి కమల్ పార్టీ..

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడిన వేళ రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమైన పార్టీలు పొత్తులు, ఎత్తులు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోగా.. ప్రధాన పార్టీలైన డీఎంకే-కాంగ్రెస్‌, అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కమల్‌ హసన్‌.. పలు పార్టీలతో పొత్తును ప్రకటించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్.

కమల్ కూటమిలో భాగస్వాములైన ఆలిండియా సమతువ మక్కల్‌ కచ్చి, ఇందియా జననాయగ కచ్చికి చెరో 40 స్థానాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు కమల్ హాసన్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం నాలుగు శాతం ఓట్లు సాధించగా.. పట్టణ ప్రాంతాల్లో 10 శాతం ఓటింగ్‌ దక్కించుకుంది.

ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు, కోయంబత్తూర్‌ అభ్యర్థి డాక్టర్ ఆర్ మహేంద్రన్ మొత్తం ఓట్లలో 11.6 శాతం సాధించగా.. పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రారంభించింది ఆ పార్టీ.. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు ఆ పార్టీ నాయకులు.

మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్‌ విజన్ డాక్యుమెంట్‌పై మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ విరుచుకుపడ్డారు. తమ మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టిందని ఆరోపించారు కమల్ హాసన్‌.