ప్రజల్లోకి కమల్‌హాసన్‌.. పొత్తులు.. ఎత్తులు.. అభ్యర్ధుల ప్రకటన?

ప్రజల్లోకి కమల్‌హాసన్‌.. పొత్తులు.. ఎత్తులు.. అభ్యర్ధుల ప్రకటన?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో వివిధ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే అవినీతి రహిత పార్టీగా ప్రకటించిన కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయం (ఎంఎన్ఎమ్) పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ప్రచారంలోకి దూకి తమిళ ఎన్నికల సమరంలో నిలుస్తోంది.

సినిమాల్లో విలన్లను ఢీకొట్టిన కమల్ హాసన్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే పార్టీని ప్రకటించిన కమల్‌హాసన్‌.. మార్చి 3వ తేదీ నుంచి ప్రచారంలోకి దిగుతున్నట్లు ప్రటించారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏ పార్టీతో జతకడతామన్నదానిపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పిన కమల్.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మార్చి7వ తేదీన కమల్‌ హాసన్ పార్టీ మక్కల్‌ నీది మయ్యం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

తమిళనాడులో ఏప్రిల్‌ 6వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుండగా.. కొన్ని దశాబ్ధాలు తర్వాత రాజకీయ ఉద్దండులు జయలలిత, కరుణానిధి లాంటి అగ్రనేతలు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే కూడా సరైన దిశానిర్దేశం లేకుండానే సాగుతుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటిన డీఎంకే.. ఈ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమాగా ఉంది.

అయితే, పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ రెండు పార్టీల్లోనూ లుకలుకలు.. శశికళ రూపంలో అన్నాడీఎంకేకు, అళగిరి రూపంలో డీఎంకేకు ఇబ్బందులు తీవ్రం అవుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు పోటీగా కమల్‌ హాసన్ కూడా రంగంలోకి దిగుతున్నారు. దీంతో కమల్ హాసన్ ఏమేరకు ప్రభావం చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. కమల్ హాసన్ ప్రభావం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్న విషయం. స్టాలిన్‌ చాలాకాలం నుంచే ప్రజల్లో తిరుగుతుండగా.. అధికార అన్నాడీఎంకే వరాల జల్లు కురిపించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో కమల్‌హాసన్‌ ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. కొంతకాలంగా కమల్ హాసన్ పలు సభలు, సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ అవి ఎన్నికల ప్రచార స్థాయిలో లేవు. ఇప్పుడు పూర్తిస్థాయిలో క్యాంపెయిన్‌పైనే ఫోకస్‌ పెట్టబోతున్నారు.

అయితే కమల్ హాసన్ ప్రభావం సినీ గ్లామర్‌తో ముడిపడి ఉన్న అన్నాడీఎంకే పార్టీపై ప్రభావం చూపుతోందని కొంతమంది అంటుంటే.. ప్రతిపక్ష ఓట్లను చీల్చి డీఎంకేపై ప్రభావం చూపుతోందని కొందరు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కమల్‌ ఎవరితో జట్టుకడతారనేది కూడా ఒక అంశమే. తమిళనాడులో థర్డ్‌ఫ్రంట్‌ రావొచ్చని కమల్ హాసన్ ఇప్పటికే ప్రకటించారు. దానికి తానే నేతృత్వం వహించబోతున్నానని కూడా అన్నారు. పొత్తుపై డీఎంకే నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే అగ్రనేతలు నేరుగా మాట్లాడితేనే ఆలోచిస్తానని కమల్ హాసన్ చెప్పారు. దీంతో కమల్‌ హాసన్ అడుగులు ఎటు వేస్తారనేది తెలియట్లేదు.

సర్వేల ప్రకారం మాత్రం కమల్‌పార్టీ ప్రభావం అంతంతమాత్రమేనని తెలుస్తోంది. మరి ఈ నెలరోజుల ప్రచారంలో కమల్‌ ఓటర్లను ఏ మేరకు తనవైపు తిప్పుకుంటారో.. సినీస్టార్‌ పొలిటికల్‌ స్టార్‌గా మారతారా? లేదా అన్నది చూడాల్సిందే. మరోవైపు సీనియర్ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) అధినేత శరత్ కుమార్.. లేటెస్ట్‌గా కమలహాసన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ, కమల్ పార్టీ మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం)తో పొత్తుకు ప్రతిపాదన చేసినట్లు చెప్పారు.