ఫేస్‌బుక్‌లో అమ్మకానికి కిడ్నీలు, గుండెలు పిండే దయనీయ గాథ

ఫేస్‌బుక్‌లో అమ్మకానికి కిడ్నీలు, గుండెలు పిండే దయనీయ గాథ

Conductor Puts Kidney On Sale On Facebook: కరోనా వైరస్ మహమ్మారి మనుషుల జీవితాలను చిన్నాబిన్నం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను దారుణంగా దెబ్బతీసింది. చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగానే ప్రభావం చూపింది. చాలామంది రోడ్డున పడ్డారు. పూట గడవటం కూడా కష్టంగా మారింది. తాజాగా.. కష్టాల కడలి ఈదలేక.. ఓ వ్యక్తి ఏకంగా తన కిడ్నీలను అమ్మకానికి పెట్టాడంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆయన పేరు హనుమంత్ (38). కర్ణాటక ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ ప్రభావంతో సంస్థ జీతాల్లో కోత విధించింది. దీంతో వచ్చే అరకొర జీతంతో కుటుంబ పోషణ భారమైంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చిపడ్డాయి. బయటపడేందుకు మరో దారి లేకపోవడంతో హనుమంత్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. డబ్బు కోసం తన కిడ్నీని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించాడు. ఈ మేరకు కిడ్నీని అమ్మకానికి పెడుతున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

‘నేను రవాణా సంస్థలో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కోతలతో కూడిన జీతం సరిపోవడం లేదు. రేషన్, ఇంటి అద్దె, పిల్లల చదువులు భారంగా మారాయి. డబ్బు కోసం నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నా. ఆసక్తి ఉన్నవాళ్లు నాకు ఫోన్‌ చేయండి.’ అంటూ హనుమంతు తన ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన ఫేస్‌బుక్ పేజీని ట్యాగ్‌ను జత చేశాడు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని జాలి చూపించారు. ఎంత కష్టం వచ్చింది అని వాపోయారు. కిడ్నీలు అమ్మొద్దు.. మేము సాయం చేస్తామని కొందరు వ్యక్తులు ముందుకొచ్చారు.

కాగా, హనుమంతు పోస్టుపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హనుమంతు క్రమంగా ఉద్యోగానికి రాకపోవడంతోనే అతడికి తక్కువ జీతం వస్తుందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై అతడికి తాము చాలా సార్లు హెచ్చరించామని తెలిపారు.