మాజీ సీఎం బంధువు హత్య కేసులో మలుపు, తిరుపతిలో ఉరేసుకున్నాడు

మాజీ సీఎం బంధువు హత్య కేసులో మలుపు, తిరుపతిలో ఉరేసుకున్నాడు

karnataka former cm dharam singh relative death case: కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాలతో బయటపడగా, మరొకరు మృతి చెందారు.

అమెరికా నుంచి వచ్చిన సిద్దార్థ్ జనవరి 19న స్నేహితులను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో తిరుపతి కొర్లగుంటకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి (28), వినోద్‌లను పోలీసులు నిందితులుగా గుర్తించారు. బీటెక్ పూర్తి చేసిన శ్యాంసుందర్‌రెడ్డి ఉద్యోగాల కోసం 2014 నుంచి చెన్నై, బెంగళూరు మధ్య తిరుగుతున్నాడు. కొంతకాలంగా బెంగళూరులోని వినోద్ దగ్గర ఉంటున్నాడు.

సిద్ధార్థ్ హత్య కేసులో వీరిద్దరి పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన శ్యాంసుందర్, వినోద్‌లు భయపడ్డారు. పోలీసులు ఎలాగైనా తమ ఇంటికి వస్తారని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి-రేణిగుంట మార్గంలో రైలు కింద పడడానికి వినోద్ యత్నించాడు. అయితే, రైలు వేగానికి పక్కకు పడిపోయాడు. కాలు, చేయి విరిగి విలవిల్లాడుతున్న అతడిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అంతకు నాలుగు రోజుల ముందే శ్యాంసుందర్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి శ్రీనివాసం వెనక ఉన్న తాళ్లపాక చెరువు ముళ్లపొదల్లోని చెట్టుకు శ్యాంసుందర్ తన చొక్కాతో ఉరివేసుకున్నాడు. నిన్న(ఫిబ్రవరి 1,2021) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడి ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.

ధరమ్ సింగ్ బంధువు సిద్దార్థ్ సింగ్.. కొంతకాలం క్రితం నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో శవమై కనిపించాడు. అత్యంత కిరాతకంగా అతడిని హత్య చేసి రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బెంగళూరు పోలీసులు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. హత్య కేసులో ఏ1 నిందితుడు శ్యామ్‌. సిద్ధార్థ్ హత్య కేసులో నిందితులు శ్యామ్‌, వినోద్‌ ఇద్దరూ ఏపీకి చెందిన తిరుపతి వాసులే కావడం గమనార్హం.

వినోద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. నెల్లూరు జిల్లా రాపూరు తీసుకెళ్లారు. అక్కడే సిద్ధార్థను పూడ్చి పెట్టగా, పోలీసులు మంగళవారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం చేయనున్నారు.

వినోద్ ఇచ్చిన సమాచారం ప్రకారం సిద్ధార్థ్ సింగ్‌ను హత్య చేసి నెల్లూరు జిల్లా రాపూరు దగ్గర పెంచల కోన ప్రాంతంలో శవాన్ని పూడ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బెంగళూరు పోలీసులు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో శవాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు ప్రధానంగా ఆర్థిక లావాదేవీల్లో విబేధాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.